పరాభవం అంచున రాజగోపాల్ రెడ్డి..?
1 min read
మునుగోడులో పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. పోల్ మేనేజ్మెంట్ కోసం కసరత్తు చేస్తున్నాయి. చివరి రెండు రోజులు డబ్బులు,మద్యం పంపిణి ఎలా చేయాలన్న దానిపైన ద్రుష్టి సారించాయి. అయితే మునుగోడు ప్రజల చైతన్యం ముందు ప్రలోభాలు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు. భావజాలం ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో జనం నాడి పట్టడం కష్టంగా మారింది. సిద్దాంతాలకు కట్టుబడి ఇక్కడి ప్రజలు పని చేస్తుండటం కొన్ని పార్టీలకు మింగుడుపడటం లేదు.
నిజానికి మునుగోడు కాంగ్రెస్,కమ్యూనిస్టు,టీఆర్ఎస్ పార్టీలకు మంచి పట్టున్న నియోజకవర్గం. కమ్యూనిస్టులు బలహీనపడిన నేపథ్యంలో ఆ ఓట్లను టీఆర్ఎస్ తన వైపు తిప్పుకుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి. మూడేళ్ల నుంచి ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాతున్నప్పటికి ఇక్కడ ప్రత్యామ్నాయ నాయకుడిని కాంగ్రెస్ తయారు చేసుకోలేకపోయింది. రాజగోపాల్ రెడ్డి ఊగిసలాట ధోరణితో పాటు ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపి కావడంతో పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహారించింది. చివరికి రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహాం చేసి వెళ్లడంతో నాయకత్వం కోసం కాంగ్రెస్ వెతుకులాటలో పడింది. ఎన్నిక వచ్చే సమయానికి కొంత కోలుకున్న ఆ పార్టీ పాల్వాయి స్రవంతిని రంగంలోకి దింపి పోరాడుతోంది. మరో వైపు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కేడర్ ను చీల్చి వారికి బీజేపీ కండువాలు కప్పారు.సర్పంచ్ లు, ఎంపిటిసిలకు రేటు కట్టి మరి కాషాయ కండువాలు వేశారు. దీంతో చాలా మండలాల్లో కాంగ్రెస్ కు ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. గ్రామస్థాయిలో నాయకులు పార్టీ ఫిరాయించడంతో కార్యకర్తలు కొంత అయోమయానికి గురయ్యారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో పార్టీ కేడర్ మళ్లీ నిలదొక్కుకుంది. టిక్కెట్ ఆశించి భంగపడిన ముఖ్యనేతలు పార్టీ దాటకుండా విశ్వాసం నింపడంతో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. బలమైన నాయకులు చలమల్ల క్రిష్ణారెడ్డి, పున్నా కైలాష్ నేతతో పాటు మరికొందరు కాంగ్రెస్ కు కట్టుబడి ఉండటంతో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీనికి తోడు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆత్మరక్షణ నుంచి ఎదురుదాడి స్థాయికి రావడం మరో విశేషం. రాజగోపాల్ రెడ్డి నమ్మకద్రోహం పైన రగిలిపోతున్న కాంగ్రెస్ కేడర్ ఆయనను వెంటాడుతోంది. ఎక్కడికి వెళ్లినా గో బ్యాక్ అంటు నినదిస్తోంది. తనతో పాటు 80 శాతం కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకుంటారని లెక్కలు వేసుకున్న రాజగోపాల్ రెడ్డికి ఇది పెద్ద ఎదురుదెబ్బ. పార్టీ మారకపోగా ఎదురుతిరగడంతో ఆయన పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గోయ్యిలా తయారైంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో రాజగోపాల్ రెడ్దికి స్వాగతం పలికే వారు లేకపోవడం విశేషం. కేవలం డబ్బుతోనే రాజకీయాన్ని మార్చేస్తాని భావించిన ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు తాము అమ్ముడుపోయే రకం కాదని తేల్చి చెప్పారు.
ఇదే సమయంలో కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక తీసుకువచ్చారన్న విషయం మునుగోడు జనానికి అర్థమైంది. తనకు 18 వేల కోట్లు కాంట్రాక్ట్ వచ్చిందని ఆయన ఎప్పుడైతే అంగీకరించారో ఆ నాటి నుంచే రాజగోపాల్ రెడ్డి నైతికంగా దెబ్బతిన్నారు.పార్టీలకు అతీతంగా మునుగోడు సాధారణ జనాన్ని ఈ విషయం ఆలోచింప చేస్తోంది. అనవసరంగా ఎన్నిక తెచ్చారన్న భావన పెరగడంతో రాజగోపాల్ రెడ్డిపైన అసహనం వ్యక్తమౌతోంది. కేసీఆర్ పైన పోరాటం కోసం త్యాగం చేశానన్న ఒక్క పాయింటుతో ఎన్నికలు గెలుస్తానని లెక్కలు వేసుకున్న రాజగోపాల్ రెడ్డి బోల్తా కొట్టినట్లు కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ తరహాలో తనని కూడా మునుగోడు ప్రజలు నెత్తిన పెట్టుకుంటారన్న అంచనాలు తారుమారయ్యాయి. రాజగోపాల్ రెడ్డిపైన మునుగోడు ప్రజల్లో ఎక్కడా సానుభూతి లేదు. పైగా తమ ఓట్లను తాకట్టుపెట్టి 18వేల కోట్ల కంట్రాక్ట్ తెచ్చుకున్నారన్న జలసీ పెరిగింది. కేవలం డబ్బులతో తమను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారన్న కోపం ఉంది. తమ భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడనే అసహనం కనిపిస్తోంది.
దీనికి తోడు రాజగోపాల్ రెడ్డిపైన మునుగోడు సాధారణ జనంలో చాలా పెద్ద అంచనాలున్నాయి. ఆయనకు 18వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి తమకు భారీగా ముడుతుందని కొంత మంది ఆశపడుతున్నారు.ఓటుకు కనీసం పది వేలు ఖాయమన్న అంచనాకు వచ్చారు. ఒక్క బీజేపీ నుంచే ఒక్కొక్కొ ఇంటికి నలభై నుంచి యాభై వేల వరకు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ అంచనాలను అందుకోవడం కష్టమే. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పంచడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే ఆయనకు చెందిన కోట్లాది రూపాయలు పోలీసుల చేతికి చిక్కుతున్నాయి. మునుగోడులోకి నోట్ల కట్టలు తీసుకురావడం రాజగోపాల్ రెడ్డి టీంకు పెద్ద సవాల్ గా మారింది. పోలింగ్ నాటికి జనం చేతికి డబ్బు అందకపోతే రాజగోపాల్ రెడ్డికి పడే దెబ్బ మాములుగా ఉండదు. జనాల అంచనాకు ఒక్క రూపాయి తగ్గినా ఈవీఎంలో కమలం పువ్వు వాడిపోవడం ఖాయం.
మరో వైపు బీజేపీ నాయకత్వం కూడా రాజగోపాల్ రెడ్డి ప్రయోగం విఫలమైందన్న అంచనాకు వచ్చింది. పార్టీ ముఖ్యనేతలతో పాటు కార్యకర్తలకు భవిష్యత్ అర్థమైంది. మునుగోడులో మనం ఏం చేయలేమన్న అంచనాకు వాళ్లు వచ్చారు. దుబ్బాక,హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ కేడర్ లో ఆత్మవిశ్వాసం తొణికసలాడేది. కాని మునుగోడు విషయంలో మాత్రం కాషాయ కేడర్ మొదటి నుంచి ఆత్మరక్షణలోనే ఉంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చూసి బీజేపీ సానుభూతిపరులు పెదవి విరుస్తున్నారు.జనం నాడీ అర్థం కావడం చాలా మంది కాషాయ నాయకులు మల్లగుల్లాలుపడుతున్నారు. కేసీఆర్ బద్ద వ్యతిరేకులు ఈటెల రాజేందర్, వివేక్ తప్ప మిగిలిన ముఖ్యనేతలు నామ్ కే వాస్తే ప్రచారం చేస్తున్నారు.పైగా బీజేపీ నైతికంగా పతనమౌతున్న తీరు కొంత మంది నాయకులకు ఆవేదన కల్గిస్తోంది.సిద్దాంతాలను గాలికి వదిలేసి డబ్బు,మద్యాన్ని నమ్ముకోవడం కషాయ నాథులను కలవరపరుస్తోంది. రాజగోపాల్ రెడ్డిలాంటి పెట్టుబడిదారుల కోసం పార్టీని పణంగా పెడుతున్న తీరు వారికి మింగుడుపడటం లేదు.
మునుగోడులో బీజేపీకి గెలుపు అంచనాలు లేవు. కనీసం రెండో స్థానమైనా గౌరవ ప్రదమైన ఓట్లుతో దక్కించుకుంటే చాలు అన్న భావనకు నేతలు వచ్చారు. కాని కాంగ్రెస్ కేడర్ ఆత్మవిశ్వాసం ముందు రాజగోపాల్ రెడ్డి నిలబడటం కష్టంగానే కనిపిస్తోంది.పోలింగ్ కు వారం రోజుల ముందు కూడా ఆయన మూడోస్థానంలోనే ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మునుగోడు జనం మరింత చైతన్యం చూపిస్తే రాజగోపాల్ రెడ్డికి ఘోర అవమానం కూడా ఎదురయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.