తెలంగాణకు రాహుల్ గాంధీ
1 min readతెలంగాణ కాంగ్రెస్ జోరుమీదుంది.పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకున్న తర్వాత ఊపు మీదికి వచ్చిన ఆ పార్టీ మరింత స్పీడ్ పెంచడానికి సిద్దమైంది. నేతల మధ్య విభేదాల అంశం కొలిక్కి రావడంతో పార్టీ నాయకత్వం దూకుడును ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన 40 మంది సీనియర్లను పిలిపించుకొని రాహుల్ గాంధీ సుధీర్ఘంగా మాట్లాడారు. పార్టీలో లోటుపాట్లను తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించారు. దీంతో పాటు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించబోమన్న బలమైన సంకేతాలను కూడా సీనియర్లకు ఇచ్చారు. కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని ఆయన కుండబద్దలు కొట్టారు. విభేదాలు ఉంటే అధిష్టానం ద్రుష్టికి తీసుకురావాలని రాహుల్ గాందీ సూచించారు. మీడియా ముందు పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడవద్దని ఆయన తేల్చారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలకు అడ్డుపడొద్దని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో ఎలాంటి పొత్తు ఉండబోదని ఆయన నేతలకు స్పష్టత ఇచ్చారు. టీఆర్ఎస్ తో మెతక వైఖరీ అవలంభించవద్దని, పోరాటాలు చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణ లో పార్టీ కోసం ఎంత సమయమైనా ఇస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మరో వైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన కారాలు మిరియాలు నూరిన కొంత సీనియర్లు రాహుల్ సమావేశంలో మౌనం వహించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపైన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరికొందరు తమ అభిప్రాయాలను లేఖ ద్వారా అందజేశారు.
మరో వైపు తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ ఖరారైంది. ఈ నెలాఖరున రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారు. రైతు సమస్యలపైన వరంగల్ లో ఈ నెల 28 న జరిగే భారీ బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. 29న హైదరాబాద్ పార్టీ ముఖ్యనేతల సమావేశానికి హాజరుకానున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీ కి ఘనస్వాగతం పలకనున్నారు. కనివిని ఎగరని రీతిలో బహిరంగ సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు.