పుట్టా కథకు క్లైమాక్స్
1 min readటీఆర్ఎస్ లో మరో నేత కథ ముగిసినట్లే ఉంది. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు అరెస్టు దాదాపు ఖాయమైంది.అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో ఆయన పాత్ర బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం విచారణలో ఉన్న మధును అరెస్టు చూపించే అవకాశాలున్నాయి. పుట్టా మధుతో పాటు ఆయన భార్య శైలజను కూడా పోలీసులు పిలిచి విచారించారు. వామనరావు దంపతుల హత్య వెనుక పుట్టా పాత్రను వెలికి తీయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పుట్టాతో పాటు మరో 11 మంది ఆయన సన్నిహితుల బ్యాంక్ ఎకౌంట్లపైన విచారణ జరుపుతున్నారు. ఎకౌంట్ల వివరాలను బ్యాంక్ ల నుంచి తెప్పించుకొని పరిశీలిస్తున్నారు. వామనరావు దంపతుల హత్యకు ముందు, ఆ తర్వాత ఈ ఎకౌంట్ల నుంచి జరిగిన లావాదేవీలపైన ద్రుష్టి సారిస్తున్నారు. దాదాపు రెండు కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి వామనరావు దంపతులను హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో వైపు పోలీసులు అరెస్టు చేసిన వెంటనే పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి పుట్టా మధు రాజీనామా చేయాల్సి ఉంటుంది. పార్టీ అధిష్టానం రాజీనామా చేయాలని ఆయనను ఆదేశించనున్నది. దీంతో పాటు టీఆర్ఎస్ నుంచి కూడా పుట్టాను సస్పెండ్ చేయనున్నారు. అరెస్టు జరిగిన వెంటనే చర్యలు తీసుకోవడానికి పార్టీ నాయకత్వం సిద్దంగా ఉంది. పుట్టా మధు సతీమణి శైలజ ప్రస్తుతం మంథని మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహారిస్తున్నారు. ఆమె రాజీనామా చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. టీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఆదేశాలు వస్తే ఆమె పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. గట్టు వామనరావు హత్యలో పుట్టా దంపతుల పాత్ర పూర్తి స్థాయిలో ఖరారైతే వీరిని వదిలించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇదే సమయంలో పుట్టామధుతో సన్నిహిత సంబంధాలున్న అధికారులు,పోలీసులపైన కూడా ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ఆయనకు సహకరిస్తున్నారన్న అనుమానంతో మంథని నియోజకవర్గంలోని పలువురు ఎస్.ఐలు,సి.ఐలపైన బదిలీ వేటు వేసింది. ఇతర అధికారులపైన కూడా ద్రుష్టి సారించినట్లు సమాచారం. మంథనిపైన పుట్టా మధు ముద్రను పూర్తిగా చెరిపేయాలని పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పుట్టా మధుతో తనకు సంబంధాలపైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. పార్టీ పరంగానే మధు స్నేహితుడని, ఆయనతో వ్యాపార సంబంధాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దని ఇప్పటికే తాను మధుకు సూచించినట్లు ఈటెల అన్నారు.