తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు
1 min readMCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , పలువురు మంత్రులు సభ్యులకు తమ అనుభవాలను వివరించారు. గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒరియెంటెషన్ కార్యక్రమాలను నిర్వహించలేదని మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన తరువాత ప్రమాణస్వీకారం రోజునే ఐడి కార్డ్ తో పాటు రూల్స్ అండ్ రెగులేషన్స్ పుస్తకాలు ఇస్తాం కానీ వాటిని ఎవరు కూడా చదవడం లేదు. లేజిస్లేచర్ కి సంబంధించిన పుస్తకాలు తప్పకుండా చదవాలన్నారు. ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల్లో 57 మంది నూతనంగా ఎన్నికైన వారే ఉన్నారని, వారందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలతో మమేకం అయ్యి ఉంటేనే భవిష్యత్ లో గెలుస్తామన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది ఇది సమాజానికి మంచిది కాదని సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో చట్టసభలది క్రియాశీల పాత్ర, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత గౌరవ శాసన సభ్యులపై ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. చట్టాల రూపకల్పనతో పాటుగా అనంతరం వాటి అమలు తీరును కూడా అధ్యయనం చేయాలన్నారు. శాసన సభ్యులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలని, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారన్నారు. రోశయ్య , రజీబ్ అలీ, బోడేపూడి వెంకటేశ్వరరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఓంకార్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నర్రా రాఘవ రెడ్డి వంటి వారు గొప్ప వక్తలుగా పేరు తెచ్చుకున్నారని స్పీకర్ గుర్తు చేశారు.
బి ఆర్ యస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడం శోచనీయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఉత్తమ ఎమ్మెల్యే, ఉత్తమ ఎమ్మెల్సీ అవార్డులు ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇస్తామని ఆయన ప్రకటించారు.