ఇంటికి పుట్టా మధు
1 min readపెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు పోలీస్ విచారణ పూర్తైంది. దాదాపు మూడు రోజలు పాటు విచారించిన తర్వాత ఆయనను ఇంటికి పంపించి వేశారు. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని పుట్టా మధుకు సూచించారు. న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో పుట్టాను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం కమిషనరేట్ లో ఆయనను పోలీసు అధికారులు గంటల తరబడి విచారించారు. హంతుకులతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలైన వందలాది ప్రశ్నలు వేశారు. అయితే పుట్టా మధు నుంచి పెద్దగా సమాచారం రాబట్టలేకపోయారని సమాచారం. హత్యలతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన విచారణలో స్పష్టం చేశారు. అయితే పది రోజుల పాటు అద్రుశ్యమైన తీరు, ఇతర అంశాలపైన పోలీసులు పుట్టా మధు నుంచి వివరణ తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి శైలజాను కూడా విచారించారు. బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు డ్రా చేసిన విషయంపైన ఆరా తీశారు. తమ స్వగ్రామంలో ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డ్రా చేసినట్లు వీరు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. అయితే గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో పుట్టా మధు పాత్రపైన బలమైన ఆధారాలు పోలీసులకు దొరకలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను అరెస్టు చేయకుండా ఇంటికి పంపించి వేశారు. ఈ కేసులో పోలీసులు చేసిన హడావుడితో పుట్టా మధు అరెస్టు కావడం ఖాయమని అంతా భావించారు. కాని ఊహించని విధంగా ఆయన ఇంటికి చేరారు. వామనరావు హత్య కోసం రెండు కోట్ల సుఫారీ ఇచ్చారన్న సమాచారంతో పోలీసులు విచారణ జరుగుతోంది. పుట్టా మధుతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులకు చెందిన బ్యాంక్ ఎకౌంట్లను పరిశీలిస్తున్నారు. వీటిల్లో ఏదైనా సాంకేతిక ఆధారం దొరికితే పుట్టాను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.