నవీన్ యాదవ్ కి జై కొడుతున్న జూబ్లీహిల్స్ ఓటర్లు

అందరి వాడు – అందరికీ తోడు
– నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై సర్వత్రా హర్షం
– ప్రజాభీష్టం మేరకే బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా స్థానిక యువ నాయకుడు నవీన్ యాదవ్ పేరును ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతగా, అన్ని వర్గాలకు సుపరిచితుడిగా నవీన్ యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్‌కు బీసీ వర్గాల్లో పట్టుంది. అంతేకుండా నియోజకవర్గంలో మెజారిటీ ఉన్న ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా ఆయన్ను తమవాడిగా భావిస్తుండడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే, వివిధ వర్గాల ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఈ ప్రాంత అభివృద్ధికి మరింతగా పాటుపడతారని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్‌లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, రహదారుల మెరుగు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.
దీనికి తోడుగా ఇప్పుడు స్థానికంగా ప్రజల సమస్యలు తెలిసిన, ప్రజల మనసెరిగిన నాయకుడిగా నవీన్ యాదవ్ నియోజకవర్గానికి మరింత మేలు చేస్తారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడంతోనే అధికార పార్టీ గెలుపు ఖరారైందని పేర్కొంటున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నవీన్ యాదవ్ అభివృద్ధి పథంలోకి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సేవా కార్యక్రమాలతో విస్తృతంగా ప్రజల్లోకి
నవీన్ యాదవ్ కేవలం ఒక యువ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక సామాజిక కార్యకర్తగా, నిస్వార్థ సేవకుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 2009లోనే నవ యువ ఫౌండేషన్‌ను స్థాపించి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
– యువత, మహిళలు, మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో దగ్గరుండి ప్రజల అవసరాలను తీర్చారు.
– 2008లో 500 మందికి ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇప్పించారు. వారిలో 40 మంది ఉద్యోగాలు సాధించడం గమనార్హం.
– అలాగే నిత్యం యువతకు ఎస్ఐ, కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పిస్తూ పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు అండా నిలుస్తున్నారు.
– ఇటీవల 2,000 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం, 1000 మంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్, లిమ్కా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. అలాగే నిత్యం సామూహిక వివాహాలు చేయించడం నవ యువ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఒక భాగం.
– జూబ్లీహిల్స్‌లో ముస్లిం మైనారిటీలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న స్మశాన వాటికకు ఎర్రగడ్డంలో స్థలాన్ని కేటాయించగలిగారు.
– యూసుఫ్‌గూడలో సిక్కుల శ్మశాన వాటిక కోసం ఉద్యమించి స్థలం కేటాయించగలిగారు. ఇది తెలంగాణలోనే సిక్కుల కోసం ఏర్పాటు చేసిన మొదటి స్మశాన వాటిక కావడం గమనార్హం.
– కోవిడ్ సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు పెద్దఎత్తున నిత్యావసరాలు పంపిణీ చేశారు.
– ఇటీవల ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద 5 వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసి వారి ఆర్థిక స్వావలంబనకు నవీన్ యాదవ్ కృషి చేశారు.
ఇలా నవీన్ యాదవ్ నిత్యం తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడినా కూడా నియోజకవర్గ ప్రజలను వీడకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటూ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. తద్వారా ఆయన జూబ్లీహిల్స్‌లో అన్ని వర్గాల ప్రజల్లో మాస్ లీడర్‌గా గుర్తింపు సంపాదించగలిగారు.
స్వయంకృషితో ఎదిగిన నాయకుడు
రాజకీయంగా నవీన్ యాదవ్ స్వయంకృషితో ఎదిగిన నాయకుడు. 2014లో ఎంఐఎం టికెట్‌పై జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 41,656 ఓట్లు (25.19%) సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. ఈ ఫలితాలు నియోజకవర్గంలోని బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాల్లో ఆయనకున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచాయి. అనంతరం 2023 నవంబర్ 15న అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీసీలకు పెద్దపీట వేయాలనే నవీన్ అభ్యర్థిత్వం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ బీసీ నేత నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. తద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ ఉపఎన్నికలో బీసీ అభ్యర్థిని ప్రకటించి ఆయా వర్గాల సాధికారతలో తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తరువాతే, ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఉపఎన్నికల బరిలో దింపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు నవీన్ యాదవ్‌ను తమవాడిగా భావిస్తుండడమే కాంగ్రెస్ ఆయనకు టికెట్ కేటాయించడానికి కారణమైనట్టు తెలుస్తోంది.