మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి
1 min readమునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. మరికొందరు నాయకులు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పటికి స్రవంతి వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపించింది. స్రవంతి 2014లో మునుగోడు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇరవై వేలకు పైగా ఓట్లు సాధించారు. మునుగోడు సీటును పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించడంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తు స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సిపిఐ కంటే ఎక్కువ ఓటు సాధించడం విశేషం. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు స్రవంతిపైన ఆరేళ్ల పాటు కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. 2018లో మునుగోడు టిక్కెట్ ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో స్రవంతి మౌనంగా ఉండిపోయారు. తాజాగా ఉప ఎన్నిక రావడంతో పాల్వాయి స్రవంతి వైపు అధిష్టానం మొగ్గు చూపించింది. పాల్వాయి గోవర్థన్ రెడ్డి గతంలో 5 సార్లు మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో పాల్వాయి గుండె పోటుతో చనిపోయారు.