కేసీఆర్ కు మెంటల్..మంత్రుల నిప్పులు
1 min readమాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైన తెలంగాణ మంత్రులు విరుచుకుపడ్డారు. కేసీఆర్ పదే పదే అబద్దాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేండ్లు సీఎం గా పని చేసి పచ్చి అబద్దాలు చెపుతున్నారని ఆయన అన్నారు. విద్యుత్ విషయంలో 7 వేల మెగావాట్ల నుంచి 12 వేలకు పెంచామని కేసీఆర్ చెపుతున్నాడని, పదేళ్లలో వాళ్లు స్టార్ట్ చేసి పూర్తి చేసింది కేవలం భద్రాద్రి పవర్ ప్లాంట్ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం నేను రిపేర్ చేస్తా అని అనడానికి కేసీఆర్ ఎవరని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం మీద ఇప్పటికే 95 వేల కోట్లు ఖర్చు చేశారని, పూర్తి చేయాలంటే మరో యాభై వేల కోట్లు కావాలని ఆయన అన్నారు. మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. త్వరలోనే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లోకి వస్తారని ఆయన తేల్చి చెకప్పారు. ఒక్క ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కు రాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కు మతి స్థిమితం తప్పిందని మరో మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. మిడ్ మానేరు కాంట్రాక్ట్ చేసినట్లు తన పేరును కేసీఆర్ ప్రస్తావించడంపై ఆయన విరుచుకుపడ్డారు. తనకెలాంటి కాంట్రాక్టులు లేవని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. బిడ్డ జైల్లో ఉండటంతో కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పిందన్నారు. బీఆర్ఎస్ కు 8 నుంచి 12 సీట్లలో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదన్నారు. కవిత లిక్కర్ స్కాం కారణంగా తెలంగాణ పరువు పోయిందని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్రాలో జగన్ గెలిస్తే పైసలు వస్తాయని కేసీఆర్ అనుకుంటున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.