కేసీఆర్ రైతు బంధు లొసుగులు బయటపెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
1 min read
భూమికి, విత్తనానికి ఉన్న సంబంధం.. రైతు, కాంగ్రెస్ పార్టీది.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశర్వరావు
– బిఆర్ఎస్ ప్రకటించిన లక్షను కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై పడిన వడ్డీభారం 11,145 కోట్లు.
– నాట్లు వేసే సమయం కాదు.. కోతల సమయానికి కూడా రైతు బంధు అందించని బిఆర్ఎస్.
* రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. ఆ క్రమంలోనే మా ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో 35 శాతం అంటే రూ. 72 వేల కోట్ల నిధులను వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల ఇబ్బందులను గమనించి వారి కన్నీటిని తుడవడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే “రైతు రుణమాఫీ” “వరికి బోనస్” పథకాలను మా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసి, ఇప్పుడు సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలనే లక్ష్యంలో “రైతు భరోసా”, భూమిలేని నిరుపేద రైతు కూలీలకు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకాలను ప్రారంభించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా తయారైన వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు, రైతును రాజును చేసేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యమైన ఆరోపణలు చేస్తున్నాయి. నిన్న నల్లగొండలో జరిగిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు నిరాధారణ ఆరోపణలు చేశారు. నాట్లప్పుడు వేయాల్సిన రైతు బంధు ఓట్లప్పుడు వేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో రైతు బంధు అమలు చేసిన విధానాన్ని మరిచిపోయి అసత్య ఆరోపణలు చేశారు.
* 2018-19 నుంచి రాష్ట్రంలో రైతు బంధు ఇవ్వడం ప్రారంభమైంది. ఆ సంవత్సరం యాసంగిలో రైతు బంధు సాయం 20-10-2018 నుంచి ప్రారంభించి 30-03-2019 నాటికి పూర్తి చేశారు. ఇందుకోసం 5 నెలల 11 రోజులు తీసుకున్నారు. తర్వాతి 2019-20 సీజన్లో యాసంగి సాయాన్ని 28-01-2020న ప్రారంభించి 16-03-2020న పూర్తి చేశారు. తర్వాతి సీజన్లో 2020-21 సీజన్లో 28-12-2020న ప్రారంభించి 22-03-2021న పూర్తి చేశారు. 2022-23 సీజన్లో 21-12-2022న ప్రారంభించి 18-05-2023న పూర్తి చేశారు. ఇందుకోసం 4 నెలల 28 రోజులు తీసుకున్నారు. ఈ విధంగా దాదాపు ప్రతి యాసంగి సీజన్లో దాదాపు 5 నెలలపాటు రైతు బంధు సాయాన్ని ఒక ప్రహసనంలా సాగించారు. ఒక్క యాసంగి సీజన్ కాదు మొత్తం రైతు బంధు సాయానికి సంబంధించి గత 10 పంటకాలాల గణంకాలను పరిగణనలోకి తీసుకుంటే, ఏ ఒక్క సంవత్సరము కూడా 4 నెలలలోపు చెల్లించింది లేదు. దారుణమైన విషయం ఏమిటంటే నాట్లు పూర్తి అయి రైతు ధాన్యాన్ని అమ్మిన తర్వాత రైతులకు రైతు బంధు పూర్తి చేశారు.
* గత ప్రభుత్వం యాసంగిలో ఇవ్వాల్సిన రైతు బంధుని ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చాక వానాకాలం మొదలు కాకముందే రూ. 7,625 కోట్లు ఒక్క నెలలోనే చెల్లించాం. గత ప్రభుత్వం రాళ్లు, రాప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు సాయం ఇచ్చి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. అలా కాకుండా మా ప్రభుత్వం నిజమైన రైతులకు మరింత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో… గతంలో రూ. 10 వేలు ఇస్తే.. మా ప్రభుత్వం 20 శాతం పెంచి ఏడాదికి ఎకరానికి రూ.12 వేల రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసమే సాగు భూముల సర్వే చేయడం జరిగింది. మొన్న జనవరి 26 ఎంపిక చేసిన 561 మండలాల్లోని 577 గ్రామాల్లో 4.41 లక్షల మంది రైతులకు రూ.569 కోట్ల రైతు భరోసా సాయం అందించడం జరిగింది. పథకాన్ని మొదలు పెట్టిన 24 గంటల్లోపే ఎకరాలతో నిమిత్తం లేకుండా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జయా అయ్యాయి. సాగు భూముల సర్వేను పూర్తి చేసి మార్చి 31లోగా మిగిలిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తాం.
* గత ప్రభుత్వం రైతు కూలీలను పూర్తిగా విస్మరించింది. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో రూ. 6 వేల చొప్పున రూ.10 కోట్ల నిధులను జమ చేశాం. మిగతా వారికి మార్చి 31లోపు పూర్తి చేస్తాం.
* బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సాయానికి సగటున 4-5 నెలల సాయం తీసుకుంటే మేము మాత్రం మొదటి సారి నెల రోజుల్లో పూర్తి చేశాం. ఇప్పుడు 40 రోజుల్లో పూర్తి చేస్తున్నాం. దీన్నిబట్టి రైతు భరోసా విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఎంటో అర్ధం చేసుకోవచ్చు.
* కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు రూపంలో రూ.73 వేల కోట్ల సాయం అందించిందన్నారు. కానీ రైతుబంధు పథకం సాకుతో రైతు సంక్షేమం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అన్ని రకాల పథకాలను రద్దు చేసిన విషయాన్ని విస్మరించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన యంత్రలక్ష్మి, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీలను నిలిపి వేశారు. తద్వారా మిగిలిన నిధులను మాత్రమే రైతు బంధుకు మళ్లించిన విషయం మరిచిపోయి కేటీఆర్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.
* దేశానికి అన్నంపెట్టే రైతు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉంది. అందుకే మా ప్రభుత్వం రైతు భరోసాతోపాటు, ఆ పథకాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలి బడ్జెట్లోనే రూ. 72 వేల కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించే పథకాన్ని పునరుద్ధరించి, రైతులకు సబ్సిడీపై యంత్రాలను అందిస్తున్నాము. గత పదేళ్లలో ఒక్కసారి కూడా మట్టి పరీక్షలు చేపట్టలేదు. మా ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించింది. 2020-21 నుంచి నిలిపివేసిన పంటల బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించి, రైతు వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తున్నాం. మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వ పథకాలైన RKVY, PMKSY,PKVY వంటి పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 3000 కోట్లు రాలేదు. అట్టి మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసి, కేంద్ర ప్రభుత్వ పథకాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాము. పంట నష్ట పరిహారం ఎన్నికల ముందు ఒక్కసారి తప్ప, ఎప్పుడు చెల్లించలేదు. మా ప్రభుత్వం ఎకరానికి రూ. 10,000 చొప్పున నష్టపోయిన సందర్భంలో సంవత్సర కాలంలోనే చెల్లించి రైతులను ఆదుకున్నాము. రైతు వేదికలను నిర్మించి నిరూపయోగంగా వదిలేస్తే రూ. 20.94 కోట్లతో 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైతునేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నిరంతరం శిక్షణ అందిస్తున్నాం. మిగతా రైతువేదికలలో కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం.
* 2014, 2018 రెండు ఎన్నికల్లో రూ. లక్షలోపు రుణ మాఫీ చేస్తానని మాట తప్పిన విషయాన్ని మరిచిపోయి బిఆర్ఎస్ నాయకులు ఒక్కరికి రుణ మాఫీ జరగలేదని ఆవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014-18 వరకు 16,143.94 కోట్లు నాలుగు సంవత్సరాల వ్యవధిలో రుణ మాఫీ జరిగింది. దీనివలన రైతులపై రూ.2630 కోట్లు అధిక వడ్డీ భారం పండింది. 2018-23 వరకు రూ. 11,909.31 కోట్లు నాలుగు సంవత్సరాల వ్యవధిలో జరిగింది. 20,85,832 మంది రైతులకు సంబంధించిన రూ. 8378.97 కోట్లు చేయలేదు. ఏకకాలంలో చేయకపోవడంతో రైతులపై రూ.8515 కోట్లు అధిక వడ్డీ భారం పడింది.
* మీ ప్రభుత్వం 2014-23 వరకు నిర్దేశించిన సమయానికి రుణ మాఫీ చేయని కారణంగా రైతుల మీద రూ.11,145 కోట్ల వడ్డీ భారం పడింది. రైతుల మీద రుణ మాఫీ పేరుతో ఇంత భారం మోపిన మీకు రైతు రుణ మాఫీ గురించి మాట్లాడే హక్కు ఉందా అనే విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
* రాజకీయాల కోసం రైతులను ఉపయోగించుకునే నీతిబహ్యమైన పనులు బీఆర్ఎస్ మాత్రమే చేస్తుంది. హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఆ ప్రాంత వరకే రూ. 50 వేల వరకు రుణ మాఫీ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిన మాట వాస్తవం కాదా. ఎన్నికలు వచ్చినప్పుడల్ల కొత్త పథకాలను ప్రవేశపెట్టి ఆర్భాటం చేయడం మీ నైజం. ఆ తరువాత వాటిని పట్టించుకొన్న
దాఖలాలు ఉన్నాయా ఎన్నికలప్పుడు మీరు చేసిన ఈ కుయుక్తులను తెలంగాణ సమాజం గ్రహించింది కాబట్టే మీకు గత రెండు ఎన్నికలలో చీవాట్లు పెట్టారు.
* 80 వేల మంది రైతులు చనిపోయారు వారికి సాయం చేశాం అని రంగుల్లో ప్రభుత్వం తరపున పత్రిక ప్రకటనలు ఇచ్చి రైతుల మరణాలను కూడా రాజకీయం కోసం వాడుకున్నా విషయాన్ని బిఆర్ఎస్ నాయకులు మరిచిపోయారు.
* రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. మీ ప్రభుత్వ తప్పుల కారణంగా ఇప్పటికే వడ్డీభారంతో కుదేలైన రైతులను ఆదుకునే ఉద్ధేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా రుణ మాఫీ చేసింది. ప్రభుత్వ భూములను అమ్మకుండా, ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టకుండా రూ. 7 లక్షల కోట్ల అప్పు ఉన్న కూడా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ రైతులకు ఇచ్చిన మాట మేరకు ఏడాదిలోపు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేయడం జగింది. అర్హులైన 25,35,964 మంది రైతులకి రూ.20,616.89 కోట్ల రుణ మాఫీ చేయడం జరిగింది. సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కాని 3,13,896 మంది రైతులకు తర్వాత రూ.2747.67 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. వీటిని చూడకుండా తమ ప్రభుత్వంలో మాదిరిగానే రుణ మాఫీ జరగలేదనే భ్రమల్లో ఉంటూ, అవే నిజాలుగా నమ్మజెప్పె ప్రయత్నం చేస్తున్నారు. భ్రమల్లో విహరించడం మాని దిగివచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి.
* భూమికి, విత్తనానికి ఉన్న సంబంధం.. రైతు, కాంగ్రెస్ పార్టీది. రైతు కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ అర్ధం చేసుకున్నంతగా ఏ పార్టీ అర్ధం చేసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన డిసెంబర్ 7, 2023 నుండి ఈ క్షణం వరకు రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చాలనే దీక్షతో పని చేస్తుంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన వ్యవసాయ రంగాన్ని తిరిగిలో గాడిలో పెట్టేందుకు ఏడాదిలోనే రైతు సంక్షేమానికి రూ. 54,280 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ధాన్యం కొనకుండా వరి వేస్తే ఉరి అని బెదిరిస్తే వరికి రూ.500 బోనస్ ఇస్తామనే ప్రకటనతో ఈ ఏడాది వరి సాగులో పంజాబ్ ను వెనక్కి నెట్టి 1.53 కోట్ల టన్నుల దిగుబడితో దేశంలోనే తెలంగాణ టాప్ నిలిచింది. వరికి బోనస్ రూపంలో రైతులకు రూ.1154.40 కోట్లు అందజేశాం.
* ఈ విధంగా పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో సాగిన విధ్వంసాన్ని చెరిపివేస్తూ ఒక ప్రణాళిక ప్రకారం వ్యవసాయాన్ని పండుగ చేసి రైతు కళ్లలో ఆనందం తీసుకురాలనే బాధ్యతతో పని చేస్తున్నాం. రైతుల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునేందుకు కంకణబద్దులమై ఉన్నాం. మా ప్రభుత్వ ప్రయత్నాలను రైతులు అర్ధం చేసుకోవాలి. అనవసరంగా ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు. ప్రభుత్వం పథకాల అమల్లో ఏవైనా సమస్యలు ఉంటే అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి, సమస్యను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.