ఆఫీసుకు ఆలస్యం అయితే కఠిన చర్యలు తప్పవు –

– సమయపాలన పాటించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. తన పరిధిలోని శాఖల ప్రధాన కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ HACA, సీడ్ సర్టిఫికేషన్ కార్పొరేషన్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ & టెక్స్టైల్స్ ప్రధాన కార్యాలయాలను సందర్శించారు.
తనిఖీల సందర్భంగా సమయానికి హాజరుకాని కొంతమంది అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పొరుగుసేవల సిబ్బంది సమయపాలన పాటిస్తుండగా, రెగ్యులర్ ఉద్యోగులలో ముఖ్యంగా జనరల్ మేనేజర్, మేనేజర్ స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమయపాలనను కఠినంగా అమలు చేయాలని, విధులపట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని మంత్రి హెచ్చరించారు. సమయానికి విధులకు హాజరుకాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కమిషనర్లు, ఎండీలకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నతస్థాయి అధికారులు నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ సమయపాలన పాటిస్తూ, ప్రజాసేవలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
