కేటీఆర్.. ఎక్కడికి రావాలో చెప్పు
1 min readమాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన ఆరోపణల మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.అసత్య ఆరోపణలు చేసిన కేటీఆర్ పైన చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పిల్లి శాపనార్థాలు మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అమృత్ పథకం కింద 8,888 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ బురద జల్లుతున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 20 ,2023 న గత ప్రభుత్వం టెండర్లు పిలిచింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. నవంబర్ 29, 2023న ,తెల్లవారితే పోలింగ్ ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ మధ్య అప్పటి ప్రభుత్వం 3,515 కోట్ల ప్రైజ్ బిడ్ లను ఓపెన్ చేసిందన్నారు. మూడు కంపెనీలకు నాటి ప్రభుత్వం 3.99 శాతం ఎక్సెస్ తో ఇచ్చిందని స్పష్టం చేశారు. సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సొంత బామ్మర్ది కాదని పొంగులేటి అన్నారు. కేటిఆర్ కు సృజన్ తో దగ్గర సంబంధాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కి సృజన్ రెడ్డి సొంత అల్లుడన్నారు. కేటీఆర్ అబద్ధాల పైన చర్చకు తాను సిద్ధమని పొంగులేటి తేల్చి చెప్పారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్ చెబుతున్నవి నిజమైతే తాను అక్కడే రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు.