ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో..రేవంత్ రెడ్డికి మధుయాష్కీ లేఖ

1 min read
మితృడు రేవంత్ రెడ్డి గారికి ..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మీరు రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయికనే కాంగ్రెస్ పార్టీ.
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు దేశ స్వాతంత్ర పోరాటంలోనూ, అనంతర దేశ నిర్మాణంలోనూ చారిత్రాత్మక పాత్ర పోషిస్తూ.. అగ్రకులాలకు, బహుజనులకు, ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, పీసీసీ అధ్యక్ష, కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది.
వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం.. పార్టీ ముఖ్యం.. అన్ని పదవులు పొంది రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు చేసి అధినాయకత్వాన్ని బలహీన పర్చాలని చూసినా, వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినా.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మాత్రం చేరదీసి దగ్గరకు తీసుకుని కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇలాంటి ఎంతోమందిని నాయకులను, ముఖ్యమంత్రులను, కేంద్ర-రాష్ట్ర మంత్రులను, గవర్నర్లు, ఏఐసీసీ, పీసీసీ అధక్షులుగా పదవులిచ్చింది. శ్రీమతి సోనియాగాంధీకి 1991లోనే ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినా.. తాను తప్పుకుని పీవీ నరసింహారావుగారిని ప్రధానిని చేశారు. మూడుసార్లు ప్రధానమంత్రి పదవిని త్యజించిన ఏకైక నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీగారు మాత్రమే.
సోనియాగాంధీగారి నాయకత్వం, త్యాగం, దూరద్రుష్టితో ప్రతిపక్ష పార్టీలను సమీకరించి 2004లోయూపీఏ-1 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చి పీసీసీ అధ్యక్షుడైనా.. నేను ప్రచార కమిటీ ఛైర్మన్ అయినా అది మన గొప్పకాదు. అదంతా శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గారి చలువే.
యూపీఏ -1 లో తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టం, రైతు రుణమాఫీ, సమాచార హక్కుచట్టం, ఐటీ, టెలికామ్ రెవెల్యూషన్, సివిల్ న్యూక్లియర్ డీల్, ఇతర సంక్షేమ పథకాల అమలు వల్ల, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, యువనాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో యూపీఏ – 2 ఏర్పడింది.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నాయకుడిగా, బీసీ బిడ్డ డీ.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా, రెడ్డి-బీసీ కలయికతో సోనియాగాంధీ నాయకత్వాన 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకు గాను 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంధిభి మోగించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలానే యూపీఏ ఏర్పడింది.. ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదు అనడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కించపర్చడమూ, అవమానించడమే. బహుశా మీరు అప్పుడు పార్టీలో లేకపోవడం వల్ల ఈ చారిత్రక విషయాలను మీకు తెలియజేస్తున్నాను.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం, నక్సల్బరీ ఉద్యమం.. తొలిదశ, మలిదశ ఉద్యమాలు భూమి కోసం ఆత్మగౌరవం కోసం.. నిజాం పాలనకు, జమీందారుల దోపిడీలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగాయి. దొరలకు, గడులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలే. రావినారాయణ రెడ్డి, సురవరం ప్రతాప రెడ్డి, కొండపల్లి సీతారామయ్య, సీహెచ్ రాజేశ్వర రావు వంటి అభ్యుదవ భావాలు కలిగిన అగ్రకులాల నాయకులు బడుగులతో కలిసి అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాల చేతిలో అణగారిన వర్గాలు, బహుజనులు బలవుతున్న విషయాన్ని గుర్తించి, బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ఉండాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సోనియాగాంధీగారు తెలంగాణ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు వనురుల పంపిణీ సమానంగా జరుగుతుందని, ప్రభుత్వంలోభాగస్వామవుతారనిఆలోచన చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాలు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రిజర్వేషన్లు, దళిత ముఖ్యమంత్రి ఇస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాటలు నమ్మి ఆయనకు రెండుసార్లు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఈ వర్గాలను మొత్తంగా మోసం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోకన్నా ప్రత్యేక తెలంగాణలోనే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరింత ఎక్కవగా అణిచివేతకు గురవుతున్నారు. దళితబంధుతో దగా, రైతుబంధుతో మోసం చేశాడు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణ రాబందుల సమితి పార్టీ చేతిలో ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతింది. ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ సభతో ఉత్తేజితులై, ఊసరవెల్లి కేసీఆర్ మోసాలను గ్రహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మీరంతా ‘‘మా రెడ్లకిందనే పనిచేయాలి.. రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది’’ అంటూ చేసి వ్యాఖ్యలు అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి. మీ వ్యాఖ్యలపై ఈ వర్గాల్లో అలజడి మొదలైంది.. అట్టుడికిపోతున్నాయి.. తరగబడ్తున్నాయి.
ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను సైతం మీరు వ్యతిరేకిస్తున్నట్లు మీ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతం పదవులు కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇది అత్యంత దారుణం. ఖండిచతగ్గ విషయం.
ఒక్క రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడేదంటే.. సుమారు ఏడు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, కొత్తగా పార్టీలో చేరినా మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా 2018లో పార్టీ ఓటమి పాలైంది. అంతేకాక డీకే అరుణ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీరు కూడా స్వయంగా ఓటమి పాలయ్యారు. అంతేకాక ఉత్తమ్ పద్మావతి రెడ్డి 2018లో కోదాడ లోనూ, తరువాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ, సీనియర్ అయిన కె జానారెడ్డి 2018 ఎన్నికల్లోనూ, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీసీ యువకుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. 1999లోనూ ఇదే జరిగింది. సీఎల్పీ నేతగా పి. జనార్ధన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళినా ఓటమి పాలైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా.
కాంగ్రెస్ పార్టీ 2004-2009లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది సోనియాగాంధీ నాయకత్వం, రెడ్డి-బీసీల కలయిక అనే విషయన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇది అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2023 లక్ష్యంగా అధికారంలోకి వచ్చేందుకు కొత్తగా వచ్చిన మీకు (రెడ్డి సామాజిక వర్గానికి) పీసీసీ పదవి, సీఎల్పీ పదవి దళిత వర్గానికి, ప్రచార కమిటీ ఛైర్మన్ గా బీసీని, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీగా మరో దళితుడికి, కన్వీనర్లుగా ఇద్దరు మైనార్టీలతో సోనియాగాంధీ, రాహుల్ ధీ గారు కొత్త కార్యవర్గాన్ని రూపొందించారు. అన్నికులాలను, వర్గాలను కలుపుకుపోవాలన్న లక్ష్యంతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గారు ముందుకు వెళుతున్నారు.
సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిరావు ఫూలే, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమ స్ఫూర్తిగా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల సాక్షిగా బానిస సంకెళ్లు తెంచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకమయ్యాయి. దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరుల్లో వారి త్యాగం, భాగస్వామ్యం ఉంది. నేడు ఆ వర్గాలన్నీ మేల్కొన్నాయి. సమాన అవకాశాల కోసం పోరాటాలు చేస్తున్నాయి. అణచివేతకు, అవమానాలను సహించమని చెబుతున్నాయి. సాధించుకున్న సగం తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణ సాధించాలని ఆయా వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుగా భావిస్తున్న ఈ తరుణంలో.. అన్ని పార్టీలకు రెడ్ల మాత్రమే నాయత్వం వహిస్తే మనుగడ ఉంటుందని మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి. వ్యక్తిగతంగా మీకు .. పార్టీకి ఈ వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నయి. ఈ వ్యాఖ్యలపై అన్ని వర్గాలు తీవ్రంగా రగులుతున్నాయి. మీ వ్యాఖ్యలపై తిరుగుబాటు చేస్తామని ఆ వర్గాలు అంటున్నాయి. బహుజన వర్గాలన్ని మీ వ్యాఖ్యలను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.. ఖండిస్తున్నాయి. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మేమెంతో.. మాకంతా అంటూ ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
మీరు మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా కించపర్చేలా ఉంది. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. పీసీసీ అధ్యక్షుడిగా మీకు పర్సనల్, ప్రవేట్, పబ్లిక్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని పీసీసీ అధ్యక్షుడు మాటలుగానే మీడియా, ప్రజలు గుర్తిస్తారు. మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచనతో కూడా ఉండాలి. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెనువెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి. పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ ఆందోళనను గందరగోళాన్ని నివృత్తి చేయాలని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn