బీఆర్ఎస్ లోకి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
1 min readతెలంగాణలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సిఎం కేసీఆర్ స్వయంగా ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి పనిచేయాలని అనిల్ కుమార్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. అనిల్ కుమార్ రెడ్డి జంప్ కావడంతో భువనగిరిలో కాంగ్రెస్ భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు కారణంగానే కాంగ్రెస్ కు గుడ్ బై చెపుతున్నట్లు అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో గ్రూప్ లను ప్రోత్సహిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి కారణంగానే పార్టీ మారుతున్నట్లు ఆయన తేల్చిచెప్పారు. భువనగిరి నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయిస్తున్నట్లు కోమటిరెడ్డి ప్రచారం చేస్తున్నారని అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ లో ఉంటే తనకు టిక్కెట్ వచ్చే ఛాన్స్ లేదన్న ఆలోచనతోనే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అనిల్ కుమార్ రెడ్డికి త్వరలోనే ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది.
భువనగిరిలో ఇప్పటికే దివంగత మాధవరెడ్డి కుటుంబం టీఆర్ఎస్ లో ఉంది. ఉమా మాధవరెడ్డితో పాటు ఆమె కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. సందీప్ రెడ్డి భువనగిరి, యాదాద్రి జిల్లా జడ్పీ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి రావడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది.