కేటీఆర్ పాదయాత్ర.. హరీష్ రావు పయనం ఎటు ..?

1 min read
తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసం నానా పాట్లు పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో జీరో సీట్లు వచ్చినప్పటికి చంద్రశేఖర్ రావు మాత్రం ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం అటు ఉంచి సొంత పార్టీ కి కూడా ఆయన దిశానిర్దేశం చేయడం లేదు. సాధారణ టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ ని చూసి నెలలు గడిచిపోయింది. ఆయన కనీసం ప్రెస్ మీట్లు కూడా నిర్వహించడం లేదు.  దీంతో పార్టీ కి అంతా తామే అయినట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని ప్రతి రోజు ఏదో విధంగా ప్రచారంలో ఉండటానికి వీరిద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు.ఒక రకంగా ఈ విషయంలో వీరిద్దరి మధ్య పోటీ జరుగుతోంది. ఎవరికి వారు సోషల్ మీడియా ఏర్పాటు చేసుకుని పోటీ పడి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.  బీఆర్ఎస్ లో కీలక స్థానం కోసమే కేటీఆర్, హరీష్ రావు పోటీలు పడి విమర్శలు చేస్తున్నారని అధికార కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. కేసీఆర్ స్థానాన్ని ఎవరు దక్కించుకోవాలన్న దానిపై ఈ ఇద్దరి దృష్టి ఉందన్నది కాంగ్రెస్ వాదన. ఇది ఒక వైపు జరుగుతుండగానే కేటీఆర్ ఒక అడుగు ముందుకేశారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం  కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. పాదయాత్ర చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని , అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇంకా యేడాది కూడా కాలేదు. మరో నాలుగేళ్లకు పైగా ఎన్నికలకు సమయం ఉంది. మరి ఇప్పటి నుంచే కేటీఆర్  పాదయాత్ర గురించి ఎందుకు మాట్లాడుతున్నారనే అనుమానం కలగడం సహజం. సాధారణంగా ప్రతిపక్ష నాయకుల పాదయాత్ర లు  ఎన్నికలకు ఏడాది ,లేదా ఆరునెలల ముందు మొదలవుతాయి.  కాని కేటీఆర్ మాత్రం ముందే పాదయాత్ర సంకేతాలిచ్చారు. 
 
 
కేసీఆర్  బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు . లెక్క ప్రకారం ఆయనే  పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. కాని చంద్రశేఖర్ రావు కు అంత ఓపిక లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పరిస్థితిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పాదయాత్ర బాధ్యత ను తీసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కాని.. మరి హరీష్ రావు పరిస్థితి ఏమిటీ..? కేటీఆర్ పాదయాత్ర చేస్తే హరీష్ రావు ఏం చేస్తాడు..? ఆయన కూడా కేటీఆర్ తో పాటు నడుస్తారా..? లేక రాష్ట్రంలో చెరిసగం పాదయాత్ర చేస్తారా…?  కేవలం కేటీఆర్ మాత్రమే పాదయాత్ర చేస్తే హరీష్ రావు ఏం చేస్తాడు..? అప్పుడు పార్టీ లో హరీష్ రావు పాత్ర ఏమిటీ..? ఇలా సవాలక్ష అనుమానాలు సగటు బీఆర్ఎస్ కార్యకర్తలో తలెత్తుతున్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో హరీష్ రావు ఇమేజ్ పెరిగింది. పార్టీ శ్రేణులు కేటీఆర్ తో సమానంగా హరీష్ రావు ను చూస్తున్నారు. ఇది కేటీఆర్ అభిమానులకు ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. అందుకే కేటీఆర్ వ్యూహాత్మకంగా పాదయాత్ర సంకేతాలిచ్చినట్లు అర్థమవుతోంది. పాదయాత్ర ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ కు కాబోయే అసలు సిసలు నేత తానేనని ఆయన ప్రకటించుకున్నట్లు స్పష్టమవుతోంది.  ఈ పరిణామాలను హరీష్ రావు అభిమానులకు మింగుడుపడేలా లేవు. మరి హరీష్ రావు వీటిని ఎలా ఎదుర్కొని పార్టీలో నిలదొక్కుకుంటారో చూడాల్సిందే. 
https://youtu.be/YXTFFNH25H8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn