ప్రభుత్వానికి కేటీఆర్ బెదిరింపులు
1 min read
అధికారం పోయినప్పటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో అహంకారం తగ్గినట్లు కనిపించడం లేదు. ఆయన ఏకంగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తరలివస్తున్న కంపెనీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలను, వ్యాపారులను తన్ని తరిమేస్తామని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే తమ ప్రభుత్వం రాగానే తిరిగి లాక్కుంటామని కేటీఆర్ అంటున్నారు. ఆ భూములను ఎవరూ కొనవద్దని హెచ్చరిస్తున్నారు. కేటీఆర్ తీరు పైన అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కంచ గచ్చిబౌలి భూములపైన బీఆర్ఎస్ ఏకంగా బ్లాక్ మెయిల్ కు దిగింది. 400 ఎకరాల భూములను అభివృద్ధి చేసి కంపెనీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్లు గా అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి అన్న వాదనను తెరపైకి తీసుకువచ్చి కొందరు ఆందోళనలు చేస్తున్నారు. వీరికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మద్దతునిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ కి ఈ భూములతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఒక ప్రైవేట్ వ్యక్తి కి కేటాయించిన ఈ భూములను న్యాయ పోరాటం చేసి వెనక్కి తీసుకున్నామని పత్రాలతో సహా చూపిస్తోంది. 20 యేళ్లు గా భూములు పడాగ పడటంతో చెట్లు మొలిచాయని అధికారులు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఇంకో అడుగు ముందుకు వేసి బెదిరింపులకు దిగారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని అనేక చోట్ల ప్రభుత్వ భూములను వేలం పాట వేసి మరీ విక్రయించింది. గచ్చిబౌలి లో ఎకరం వంద కోట్ల చొప్పున విక్రయించి తన ఘనత గా చూపించింది.తమ హయాంలో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చూపించే ప్రయత్నం చేసింది. అవుటర్ రింగ్ రోడ్ ను కేవలం 7,500 కోట్ల కు ముప్పై ఏళ్ల లీజుకు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అలాంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పర్యావరణ ప్రేమికులు గా మారిపోయారు. 400 ఎకరాల భూమి పోతే హైదరాబాద్ కు ఆక్సిజన్ అందదని తెగ హడావిడి చేస్తున్నారు.
ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటున్న భూమి అటవీ ప్రాంతం కాదు. అందులో ఎలాంటి వనాలు లేవు. కేవలం చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉన్నాయి. అయినా కేటీఆర్ రాజకీయం మొదలు పెట్టారు. తమ హయాంలో ఇలాంటి భూములను అనేకం అమ్మిన చరిత్ర మాజీ మంత్రి కేటీఆర్ ది. అప్పుడు ఆయనకు చెట్లు, నెమళ్లు, జింకలు గుర్తుకు రాలేదు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ పర్యావరణం గుర్తుకు వచ్చింది. తాను ఏం చేసినా తెలంగాణ ప్రజలు నమ్ముతారన్న భావనలో కేటీఆర్ ఉన్నారు. కాని తెలంగాణ ప్రజలు చైతన్యం ముందు బీఆర్ఎస్ నాయకుల పప్పులు ఉడకవు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చైతన్యం ముందు ఆ పార్టీ ఓడిపోక తప్పదు.