ఈటెల కొడుకుపైన కేసీఆర్ కన్ను
1 min readమాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెంటాడుతూనే ఉన్నారు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పటికి ఈటెల ఎమ్మెల్యేగా కొనసాగడం, టీఆర్ఎస్ లోనే ఉండటంతో ఆయనపైన మరింత ఒత్తిడి పెంచుతున్నారు. ఈటెల ఆస్తులపైన ద్రుష్టి సారించిన కేసీఆర్ ఇప్పటికే విచారణ జరిపిస్తున్నారు. అసైన్డ్ భూములతో పాటు దేవర యాంజిల్ భూములపైన కూడా ప్రభుత్వం ఎంక్వైరీ జరుపుతోంది. ఈటెలకు చెందిన గోదాములు, ఫాంహౌజ్ పైన కూడా ఐఎఎస్ అధికారుల టీం ద్రుష్టి సారించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ స్పీడ్ తగ్గింది. అయితే ఈటెల కుటుంబ ఆస్తులపైన కేసీఆర్ స్కాన్ చేస్తున్నారు. ఎక్కడ చిన్న లోటుపాట్లు కనిపించినా విచారణలతో హడావుడి చేయిస్తున్నారు. ఈటెల రాజేందర్ ను ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా రాజకీయంగా దెబ్బకొట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. తాజాగా ఈటెల కుమారుడు నితిన్ రెడ్డి పైన కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. తన భూమిని కబ్జా చేశారని మేడ్చల్ జిల్లా రావల్ కోల్ గ్రామానికి చెందిన పీట్ల మహేష్ ముదిరాజ్ ముఖ్యమంత్రికి కంప్లైయింట్ చేశారు. దీనిపైన సి.ఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. ఫిర్యాదు మీద తక్షణమే విచారణ జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆయన ఆదేశించారు. ఎసిబి విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖలు సమగ్రమంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సొంత సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం విశేషం. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత ముదిరాజ్ వర్గానికి చెందిన అనేక మంది ఈటెలకు మద్దతుగా నిలిచారు. కక్ష పూరితంగా ఈటెలను వేధిస్తున్నారని ఆ వర్గం నాయకులు కేసీఆర్ పైన మండిపడ్డారు. దీంతో ముదిరాజ్ వర్గాన్ని శాంతింప చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరోక ఫిర్యాదును ముందుకు తీసుకువచ్చారు. సొంత సామాజిక వర్గం వాళ్ల భూములను కూడా ఈటెల లాక్కున్నాడన్న విషయాన్ని చెప్పే ఉద్దేశంతోనే ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
మరో వైపు హుజూరాబాద్ పైన మంత్రి హరీష్ రావు ద్రుష్టి సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఆయన ఈటెల ఇలాకాపైన కన్నేశారు. నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులను పిలిపించుకొని హరీష్ రావు మాట్లాడుతున్నారు. పార్టీలో కొనసాగాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన నచ్చ చెపుతున్నారు. వ్యక్తులు కాదు పార్టీ శాశ్వతమని హరీష్ రావు హుజూరాబాద్ నేతలకు స్పష్టం చేస్తున్నారు. హరీష్ రావు రంగంలోకి దిగడంతో ఈటెల వర్గంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి అన్ని వైపుల నుంచి దాడి తీవ్రం కావడంతోె ఈటెల రాజేందర్ ఒత్తిడిలో కనిపిస్తున్నారు. మరి ఈ దాడులను ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి.