రాసి పెట్టుకోండి.. తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు ఏప్రిల్ 25..కవిత

*కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తాం*
*రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదు*
*ప్రజల సమస్యల గురించి ప్రశ్నించెదెవరు అంటే ప్రతినోట జాగృతియే అనే మాట వస్తోంది*
*దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారింది*
*రాహుల్ గాంధీ ఫోన్ చేసిన సరే రేవంత్ రెడ్డి నిలబడే మాట్లాడుతున్నాడు*
*తెలంగాణ వస్తే స్వయం పాలన వస్తుందనుకుంటే ఢిల్లీకి ఘోరమైన గులాంగిరీ చేస్తున్నారు*
హైదరాబాద్ :
తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజుగా ఈనెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆరోజు తాము ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు తెలంగాణ జాగృతిలో చేరారు. బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత రంజిత్ సహా ఆయన అనుచరులకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము పెట్టబోయే పార్టీ ప్రజల కోసం కొత్త తరహా రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించటం ఇదే తమ పంథా అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేది ఎవరు అంటే ప్రతినోట జాగృతి అనే మాట వస్తోందన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు కదులుతామన్నారు. పప్పన్నం తింటూ.. ప్రజల మధ్యలో ఉంటూ వారితోనే కలిసి పనిచేస్తామన్నారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తామని చెప్పారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈనెల 25న పార్టీ ప్రకటన సందర్భంగా తమ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో పోరాదినట్లే రానున్న మూడేళ్ల పాటు ఈ ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.
*ఢిల్లీకి ఘోరంగా గులాంగిరి*
తెలంగాణ వస్తే స్వయంపాలన వస్తుందనుకుంటే ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేసే నేతలు వచ్చారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి నిలబడే మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. లేదంటే భట్టి విక్రమార్క వెళ్లి రాహుల్ కు ఫిర్యాదు చేస్తే తన సీటుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారన్నారు. తన కుర్చీ కాపాడుకోవాలన్న తనతో పాటు సంచులు మోసే వ్యక్తికి సంచులు ఉండాలన్న రాహుల్ గాంధీకి గులాంగిరి చేయాల్సిందేనన్న విధంగా రేవంత్ ప్రవరిస్తున్నాడని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రజల సమస్యల గురించి అడిగితే “నో” రాహుల్ జీ అని.. అదే కేరళ ఎన్నికలు, మనీ కావాలంటే మాత్రం “ఎస్” రాహుల్ జీ అంటూ గులాంగిరీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, హైడ్రా పేరుతో ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ సగం కూడా చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. కానీ తెలంగాణలో అన్ని చేశామంటూ పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ ఈ ముఖ్యమంత్రి కేరళకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటన్నారు.
*మోడీ ఏం చేసిన రేవంత్ గప్ చుప్*
అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాయేనని చెప్పారు. అయినా సరే ఈ ముఖ్యమంత్రి ఎందుకు మోడీ ని ప్రశ్నించటం లేదని నిలదీశారు. మోడీ ఏం చేసిన సరే రేవంత్ రెడ్డి గప్ చుప్ గా ఉంటున్నారని విమర్శించారు. అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని ఇద్దరూ మేనేజ్ చేస్తూ ప్రజలను మాత్రం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని ఫైరయ్యారు.
*గద్వాల్ గడీలో ఉద్యమకారుల జెండా ఎగరాలి*
నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ ఎంతో కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి అని కవిత అన్నారు. అందుకే ప్రజల కోసం పోరాటం చేసేందుకు జాగృతి పెట్టబోయే పార్టీలోకి ఆయనను ఆహ్వానించామన్నారు. గద్వాల్ జిల్లాలో 70 ఏళ్లుగా గడీల కుటుంబాల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. గద్వాల్ గడీలో టేకేదార్లు పోయి ఉద్యమకారుల జెండా ఎగరాలన్నారు. అక్కడి చేనేత, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాగృతి తరఫున సింహం గుర్తుతో పోటీ చేస్తే మొదటి విజయాన్ని ఇచ్చింది గద్వాల్ జిల్లానేనని కవిత గుర్తు చేశారు. రంజిత్ తో పాటు ఆయన అనుచరులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు.
*కవితక్క కమిట్ అయితే ఎంత కష్టమైనా లెక్కచేయరు*
కవితక్క ఒక్కసారి కమిట్ అయింతే ఎంత కష్టమైనా సరే లెక్క చేయరని నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగొళ్ల రంజిత్ కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదం వినిపిస్తూ ప్రజల కోసం ఫైట్ చేస్తున్న కవితక్కను బీఆర్ఎస్ నుంచి కుట్ర చేసి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదు నెలలుగా కవిత గారి కమిట్ మెంట్ చూస్తున్నానని మాట ఇస్తే ఎంత కష్టమైనా సరే అండగా ఉంటారని చెప్పారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే సత్తా ఆమెకు ఉందన్నారు. తనకు కవితక్క దేవుడు ఇచ్చిన అక్క అని… ఆమె కోసం నిజాయితీగా చిత్తశుద్ధిగా పనిచేస్తానని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామన్నారు.
