కాంగ్రెస్ లో చేరికలకు ఆడ్డుపడుతున్న నేతలు
1 min readరాష్ట్రంలో తిరిగి పుంజుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తుంది. కొత్త బాసు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పునర్ వైభవం అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకంలో పార్టీ కేడర్ లో ఉత్సాహం కనిపిస్తోంది. బహిరంగ సభలతో కార్యకర్తలను కదలిస్తు తమ సత్తా నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి టీం పనిచేస్తోంది. కేసీఆర్ సర్కార్ పైన వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తు ప్రజాభిమానం చూరగొనడానికి శ్రమిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం పార్టీ శ్రేణులను మానసికంగా దెబ్బతీసినప్పటికి రేవంత్ రెడ్డి మాత్రం దూకుడు కొనసాగుతూనే ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూనే బీజేపీని నిలువరించడానికి ఆయన శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ అసమ్మతి నేతల అడ్డుపుల్లలతో ఆయన అనుకున్నంత స్పీడ్ గా పార్టీని పరుగులు పెట్టించలేకపోతున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదన్న ఆగ్రహంతో ఉన్న కొందరు సీనియర్లు, తమకంటే జూనియర్ కు పదవి వచ్చిందన్న భావనతో మరికొందరు ఆయనకు సహకరించడం లేదు. ఎదో విధంగా ఆయనను నిలువరించే ప్రయత్నాలు ప్రత్యర్థి వర్గం నుంచి ఎదురవుతూనే ఉన్నాయి.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక ఇతర పార్టీ నేతల చూపు కాంగ్రెస్ పైన పడింది. టీఆర్ఎస్ , బీజేపీల్లో ఉన్న కొంత మంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయా పార్టీల్లో అసంత్రుప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకరిద్దరు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎక్కువ చోట్ల చేరికలకు సొంత పార్టీ నేతలే అడ్డంకిగా మారారు. జడ్చర్ల లో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, నిజామాబాద్ లో ధర్మపురి సంజయ్, ఉపాధ్యాయ సంఘ నేత హర్షవర్థన్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వచ్చారు. ఎర్రశేఖర్ ఏకంగా మహబూబ్ నగర్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి రేవంత్ రెడ్డిని కలిశారు. కాని ఆయన చేరికకు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఎర్రశేఖర్ పార్టీలో చేరడాన్ని కొంత మంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇక నిజామాబాద్ లో ధర్మపురి సంజయ్ చేరికకు చాలా మంది కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడం లేదు. మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర నాయకులు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో ధర్మపురి సంజయ్ చేరిక పైన పీసీసీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. మరో వైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ సంఘ నేత హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కాని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆయన రాకను అంగీకరించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన హర్షవర్థన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి డైలమాలో పడ్డారు. ఇలా చాలా చోట్ల పార్టీలో చేరికలకు నేతలు సిద్దమౌతున్నప్పటికి సొంత పార్టీ నేతలు మోకాలు అడ్డుతుండటంతో పీసీసీ చీఫ్ మౌనంగా ఉండాల్సి వస్తోంది.