కేసీఆర్ పైన గవర్నర్ నిప్పులు
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపైన గవర్నర్ తమిళ సై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పట్ల ప్రభుత్వం అనసరిస్తున్న తీరుపైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం తనని అవమానించేలా వ్యవహారిస్తుందని గవర్నర్ అన్నారు. గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం గౌరవించాలని తమిళ సై స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కేసీఆర్ వైఖరిని ఆమె ప్రధానికి వివరించారు. ఇటీవల కాలంలో తన పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైన తమిళ సై ప్రధాని దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ పట్ల ప్రభుత్వ వైఖరి ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎల్లప్పుడు మంచి సంబంధాలు కోరుకున్నానని గవర్నర్ వ్యాఖ్యానించారు. పాడి కౌషిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో తాను సరైన విధంగానే వ్యవహారించానని ఆమె తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్దంగానే నడుచుకున్నానని తమిళసై వ్యాఖ్యానించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి తనతో మాట్లాడవచ్చునని ఆమె అన్నారు. తన పర్యటనలో ప్రొటొకాల్ పాటించడం లేదని గవర్నర్ అన్నారు. జిల్లాల టూర్ కు వెళ్లినప్పుడు కలెక్టర్, ఎస్పీ రాకపోవడాన్ని తమిళసై ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ ప్రొటొకాల్ తెలియదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం తనకు ఎలాంటి రిపొర్ట్ కార్డు ఇవ్వడం లేదని తమిళ సై అన్నారు. గవర్నర్ స్పీచ్ లేకుండా ప్రభుత్వ పనితీరు తనకెలా తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిపైన ఎలుకలు దాడి చేసి గాయపర్చడం తనకెంతో బాధ కల్గించిందని గవర్నర్ అన్నారు. గవర్నర్ గా కాకుండా ఒక డాక్టర్ గా ఈ ఘటనపైన స్పందించానన్నారు. తెలంగాణ ప్రజలంటే తనకెంతో అభిమానమని తమిళ సై స్పష్టం చేశారు.