ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ నందినగర్ నివాసానికి వచ్చిన ఆయన రెండు రోజులు ఉన్నారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ రెండు నిమిషాలు మాత్రమే సభలో కూర్చున్నారు. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం సమయంలో కూడా సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. కేసీఆర్ తీరుపైన అధికార కాంగ్రెస్ వర్గాలు విరుచుకుపడ్డాయి. శాసనసభలో హాజరువేసుకోవడానికి మాత్రమే చంద్రశేఖర్ రావు సభకు వచ్చారని, ఆయనకు ప్రజా సమస్యలపైన చర్చించే చిత్తశుద్ది లేదని విమర్శలు గుప్పించారు.ఈ నేపథ్యంలో అత్యంతకీలకమైన కృష్ణా, గోదావరి జలాల పైన అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొంటారని అంతా భావించారు. కాని కేసీఆర్ మాత్రం హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు.
మరో వైపు శాసనసభ, శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా తమను ఎంపిక చేసినందుకు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
