ఈటెల రాజేందర్ వర్సెస్ గంగుల కమలాకర్
1 min readఈటెల రాజేందర్ పైన టీఆర్ఎస్ ద్రుష్టి సారించింది. మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేసిన సి.ఎం కేసీఆర్ ఆయనను రాజకీయంగా పూర్తిగా దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.ఈటెల ఎమ్మెల్యే పదవిని కూడా పొగొట్టడానికి ముఖ్యమంత్రి వ్యూహాలు రచిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ ను బలహీనం చేయడంపైన కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ హుజూరాబాద్ ను టీఆర్ఎస్ నాయకత్వం చేపట్టింది. ఈటెలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిన మరుక్షణం నుంచి గులాబీ నేతలు ఈటెల బలాబలాలపైన కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈటెల వెంట వెళ్లకుండా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వచ్చే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఆయన ఏదో ఒక పార్టీ తరుపున కాని ,ఇండిపెండెంట్ గా కాని బరిలోకి దిగుతారు. ఆత్మగౌరవ నినాదంతో హుజూరాబాద్ ప్రజల దగ్గరకు వెళ్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అందరి మద్దతు తీసుకుంటానని కూడా ఈటెల చెపుతున్నారు. ఉప ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ హుజూరాబాద్ పైన ఫోకస్ పెట్టింది. ఈటెల అనుచరులు, ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకోవడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి హుజూరాబాద్ లో 80 శాతం టీఆర్ఎస్ శ్రేణులు ఈటెలకు మద్దతుగా ఉన్నాయి. 90 శాతం జడ్పీటీసీలు,ఎం.పిపిలు, సర్పంచ్ లు, ఎంపిటీసీలు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లు కూడా రాజేందర్ కు అండగా ఉన్నారు. అయితే ఉప ఎన్నిక నాటికి పరిస్థితిలు మారే ఛాన్స్ ఉంది. తనకు మద్దతు తెలిపిన నాయకులను ఆకర్షించడానికి టీఆర్ఎస్ ప్రలోభాలు మొదటు పెట్టిందని ఈటెల ఇటీవల ఆరోపించారు. ఇన్నోవా కార్లు గిఫ్ట్ గా ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం తనకు మద్దతు ఇస్తున్న నాయకుల్లో 50 శాతం మంది వెనక్కి వెళ్లిపోవడం ఖాయమని ఈటెల కూడా నమ్ముతున్నారు. ఇదే సమయంలో ఈటెల ముఖ్య అనుచరులపైన టీఆర్ఎస్ గురిపెట్టింది. వారి ఆస్తిపాస్తుల వివరాలు, కేసులు, వివాదాల జాబితాలను సిద్దం చేసుకుంటోంది. వీరు ఈటెలకు మద్దతు కొనసాగిస్తే అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచడానికి వ్యూహాలు రెడీ అవుతున్నాయి. రాజేందర్ వెంట నడుస్తున్న వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) నోటీసులు ఇచ్చింది. ఐదేళ్ల క్రితం సొసైటీ ఛైర్మన్ గా పనిచేసినప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఇందులో పేర్కొన్నారు. ఇలా మరికొందరిపైన కూడా ఒత్తిడి పెంచడానికి అధికార పార్టీ సిద్ధమౌతోంది.
మరో వైపు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను గాడిలో పెట్టడానికి మంత్రి గంగుల కమలాకర్ పావులు కదుపుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగిన ఆయన ఇటీవల అక్కడి గులాబీ నేతలతో సమావేశమయ్యారు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పోయినా నష్టం లేదని కమాలాకర్ స్పష్టం చేస్తున్నారు. జనం కేసీఆర్ వెంట ఉన్నారని , పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని కమలాకర్ హామీ ఇస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి గంగులకు మద్దతుగా హుజూరాబాద్ లో హోర్డింగ్స్ వెలుస్తున్నాయి. మొత్తానికి నిన్న మొన్నటి వరకు సహచర మంత్రులుగా ఉన్న ఈటెల, గుంగుల ఇప్పుడు హుజూరాబాద్ కత్తులు దూయబోతున్నారు.