కేసీఆర్ కు ఈటెల రాజీ సంకేతాలు.. నిజమెంత..?
1 min readమాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన ఏం చేయబోతున్నారన్న దాని మీద ఉత్కంఠ నెలకొన్నది. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కు గురైనప్పటికి ఈటెల రాజేందర్ ఇప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పలేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో కూడా ఆచితూచి వ్యవహారిస్తున్నారు. రాజీనామా చేస్తానని చెపుతున్నప్పటికి ఎప్పుడన్నదానిపైన స్పష్టత ఇవ్వడం లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఈటెల రాజేందర్ మాటల దాడి పెద్దగా లేదు. తనకు అన్యాయం చేశారని మాత్రమే ఆయన అంటున్నారు. ఇంత కాలం విధేయుడిగా ఉన్న తనపైన అంత క్రూరంగా దాడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ మానవత్వం లేకుండా వ్యవహారిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పథకాలపైన ఈటెల మాటల దాడి చేయడం లేదు. పైగా కొన్ని పథకాలు బాగున్నాయని, వాటి వల్ల జనం లబ్ది పొందారని ఇంటర్వ్యూల్లో స్పష్టం చేస్తున్నారు. మరో వైపు తన పైన తీవ్ర విమర్శలు చేసిన మంత్రులపైన కూడా ఈటెల కౌంటర్ అంత స్ట్రాంగ్ లేదన్న అభిప్రాయం ఉంది.
ఈ పరిస్థితుల్లో రాజేందర్ భవిష్యత్తు కార్యాచరణ మీద అనుమానాలు మొదలయ్యాయి. దీన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈటెల పైన సంచలన కథనాన్ని ప్రచురించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరండర్ కావడానికి ఈటెల రాజేందర్ సంకేతాలు పంపినట్లు అందులో పేర్కొన్నారు. కేసీఆర్ సన్నిహితులతో రాయబారం నడుపుతున్నట్లు కథనంలో వివరించారు. రాజకీయంగా నిలదొక్కుకునే అవకాశాలు లేకపోవడంతో ఈటెల సందిగ్దంలో పడినట్లు ఆ పత్రికలో స్పష్టం చేశారు. కనీసం ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కూడా లేదన్న విషయం ఈటెల రాజేందర్ కు అర్థమైందని, అందుకే లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ లో ఈటెల సర్వే చేయించారని, అందులో టీఆర్ఎస్ వైపే జనం ఉన్నారని తేలిందని ఆ కథనంలో పేర్కొన్నారు. బీజేపీ సహకారంతో కొత్త పార్టీ పెట్టాలని ఈటెల భావించారని, ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపారని కూడా అందులో స్పష్టం చేశారు. అయితే పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఓడిపోవడంతో అంచనాలు తారుమారయ్యాయన్నారు. ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ ఈటెలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని కథనంలో వివరించారు.మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత అసలు విషయం ఈటెలకు అర్థమైందని, అందుకే కేసీఆర్ కు సరెండర్ అవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చౌకబారు వార్తలు రాయడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న తాను దాన్ని చంపుకొని కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదన్నారు. చౌకబారు వార్తలతో తన ఆత్మాభిమానాన్ని కించపర్చవద్దని ఆయన పత్రికకు హితవు పలికారు.ఇప్పటికే తాను స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా లొంగిపోయారని రాయడం సరైనది కాదన్నారు. తన అభిప్రాయం తీసుకోకుండా రాసిన వార్తను ఫైయిడ్ న్యూస్ గా భావించాల్సి ఉంటుందని ఈటెల తన ఖండనలో పేర్కొన్నారు. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలోనే ఆయన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ నాయకురాలు డీకె అరుణను కలిశారు. తన భవిష్యత్తు కార్యాచరణపైన ఈటెల వారితో చర్చించారు.
ఈటెల రాజేందర్ స్వతాహాగా నెమ్మదస్తుడు. పరుషంగా మాట్లాడే అలవాటు ఆయనకు ముందు నుంచి లేదు. అందుకే కేసీఆర్ పైన ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇంతకాలం ఆయనతో పాటే పనిచేసి ఇప్పుడు నోటికొచ్చినట్లు విమర్శించడం నైతికంగా కరెక్ట్ కాదు. అందుకే ఈటెల రాజేందర్ తీవ్ర రాజకీయ విమర్శల జోలికి వెళ్లడం లేదు. అయితే కరుడుగట్టిన కేసీఆర్ వ్యతిరేకులకు ఇది నచ్చడం లేదు. ఈటెల నసుగుతున్నారని ,భయపడుతున్నారనే వ్యాఖ్యలు వారి నుంచి వస్తున్నాయి. కాని రాజకీయ అవసరాల రీత్యా భవిష్యత్తులో తన గురువు కేసీఆర్ పైన రాజేందర్ మాటల మంటలు మండించాల్సిందే.