రేవంత్ రెడ్డితో భేటీ..ఈటెల క్లారిటీ
1 min readటీఆర్ఎస్ తో తన అనుబంధం ముగిసేనట్లేనని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు. ఇక ఆ పార్టీలో ఉండబోనని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పదవి నుంచి అవమానకరంగా తొలగించిన తర్వాత టీఆర్ఎస్ లో ఎలా కొనసాగలేనని ఈటెల అన్నారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే తన రాజీనామా ఎప్పుడు ఉంటుందన్న దానిపైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలు సరైనవి కాదని ఆయన అంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో ఎన్నికల పేరుతో వారి దగ్గరకు వెళ్లలేమని ఈటెల స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా పలు చోట్ల కేసులు పెరిగాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ప్రచారం కోసం కనీసం ఇంట్లోకి కూడా నాయకులను రానివ్వడం లేదని రాజేందర్ చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో తన నియోజకవర్గ ప్రజలను రాజకీయాల కోసం ప్రమాదంలోకి నెట్టనని ఆయన స్పష్టం చేశారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత రాజీనామా పైన స్ఫష్టత ఇస్తానన్నారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మాత్రం ఖాయమన్న మాత్రం ఆయన తేల్చి చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవానికి అండగా నిలుస్తారన్నారు. ఆత్మగౌరవ నినాదంతోనే తాను ఎన్నికలకు వెళ్తానని రాజేందర్ తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ ఇప్పటికే తన నియోజకవర్గంలో ప్రలోభాలు మొదలు పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇన్నోహ కార్లు, డబ్బులు ఇస్తామని నాయకులకు ఆశ చూపిస్తారని, త్వరలోనే ఆధారాలు భయటపెడతానని రాజేందర్ స్పష్టం చేశారు. అయితే హుజూరాబాద్ ప్రజలు మాత్రం తనకు అండగా నిలుస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరో వైపు పుట్టా మధుతో తనకు టీఆర్ఎస్ పార్టీ సంబంధం మాత్రమేనన్నారు. దుర్మార్గంగా హత్యలను తనకు అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని పుట్టా మధుకు తాను హితబోధ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని, చాలా మంది నాయకులు ఫోన్ చేసి మాట్లాడారని రాజేందర్ చెప్పారు. రేవంత్ రెడ్డిని ఒక చోట కలిశానని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఫోన్ లో మాట్లాడారని ఆయన తెలిపారు. పార్టీ ఏర్పాటుపైన ఇప్పట్లో నిర్ణయం తీసుకోకవచ్చునని ఈటెల పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా కొత్త పార్టీ ఆలోచన ఉండే సూచనలున్నాయి.