రేవంత్ రెడ్డి చొర‌వ‌..తెలంగాణ కు 9 వేల కోట్ల పెట్టుబ‌డులు

ఫార్మా రంగంలో మరో మైలురాయి

తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అమెరికా కంపెనీ

హైదరాబాద్ లో ఎల్ లిల్లీ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ హబ్

ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ.. సేవల విస్తరణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు

తెలంగాణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే ఒక బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఎల్ లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది.

సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ చర్చల అనంతరం ఎల్ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్షరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్షరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది.

కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది.

ప్రధానంగా డయాబెటిస్‌, ఓబెసిటీ, ఆల్జీమర్‌, క్యాన్సర్‌, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి. హైదరాబాద్లో ఈ ఏడాది ఆగస్ట్ లోనే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ ను ప్రారంభించింది.

విస్తరణలో భాగంగా ఎల్ లిల్లీ కంపెనీ బారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇదొక గర్వ కారణమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మ హబ్ గా పేరొందిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

1961 లో ఐడీపీఎల్ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారిందని, ప్రస్తుతం 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని చెప్పారు.

హైదరాబాద్ లో ఎల్ లిల్లీ కంపెనీ విస్తరణ తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుందని అన్నారు. ఎల్ లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn