లగచర్ల పై కేటీఆర్ స్కెచ్ ..రేవంత్ రెడ్డి పంచ్
1 min readకొడంగల్ లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. వెనుకబడిన తన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడి యువత కు ఉపాధి కల్పించాలని ఆయన భావిస్తున్నారు. దానికి అనుగుణంగా పారిశ్రామిక వాడ ను తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దాదాపు 1100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా భూసేకరణ ను ప్రారంభించారు. ఇందులో చాలా వరకు అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. మరో 700 ఎకరాల వరకు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఎకరానికి 40 లక్షల వరకు పరిహారం తో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే సగానికి పైగా రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే లగచర్ల లో బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ పైన దాడి చేయడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అసలు కుట్రదారులను వెలికి తీస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
అయితే లగచెర్ల లో గిరిజన రైతులను ప్రభుత్వం వేధిస్తోందని కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఎస్సీ కమిషన్ కూడా ఆశ్రయించారు. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి గగ్గోలు పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజనులను వేధిస్తోందని, వాళ్ల భూములను లాక్కుంటోందని కేటీఆర్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే లగచెర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిలో ఎస్టీలు ఏడుగురు మాత్రమే ఉన్నారు. దళిత వర్గానికి చెందిన ఒకరన్నారు. ఇక 13 మంది బీసీ లు, ఒక రెడ్డి కూడా దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక మొత్తం భూసేకరణలో ఎస్టీ లకు సంబంధించిన 11 శాతం భూములను మాత్రమే ప్రభుత్వం తీసుకుంటోంది. కాని కేటీఆర్ మాత్రం ఈ అంశాన్ని గిరిజనుల కోణంలో చూపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కొడంగల్ కు సంబంధించిన ఈ సమస్య పైన మహబూబాబాద్ లో నిరసన సభ పెట్టారు. కొడంగల్ కు, మహబూాబాద్ కు ఏం సంబంధం అన్న ప్రశ్న కు బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల్లో అశాంతి రేకెత్తించడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులను ఎగదోయాలన్నదే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దీని పైన కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. లగుచర్లలో రైతులకు అన్యాయం జరిగిందని భావిస్తే వారికి న్యాయం చేయాలని కోరడం లో తప్పు లేదు. కాని రైతులను వదిలేసి రాజకీయం చేయడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.