నేనే రాజు,నేనే మంత్రి అంటే ..

నేనే రాజు, నేనే మంత్రి అన్న తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యల వెనక తన ఉద్దేశం వేరని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాను ఆ కామెంట్స్ చేశానని ముఖ్యమంత్రి వివరించారు. సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు, నేనే మంత్రి కామెంట్స్ వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేశారు. ముఖ్యమంత్రి , మున్సిపల్ మంత్రి కూడా నేనే , ఎన్నికల ఫలితాలకు కూడా నాదే బాధ్యత అన్న కోణంలో నేనే రాజు, నేనే మంత్రి అన్న వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన పని తీరు ఆధారంగానే మున్సిపాలిటీల్లో ప్రజలు ఓట్లు వేశారని ఆయన అన్నారు. 90 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల పైన కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన విమర్శించారు. నేను పాలకుడిని కాదు సేవకుడిని అని గతంలోనే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సేవ చేయడానికే ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని, ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానన్నారు.
