కులగణన పైన కుట్రలు
1 min read
కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ గారు ఆనాడే చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారని ఆయన స్పష్టం చేశారు. బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో సమావేశమయ్యారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని,ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించామన్నారు. మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదన్నారు.సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉంది కాబట్టే ఆనాటి ప్రభుత్వం లెక్కలను బయటపెట్టలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ మేం చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇంటింటికి ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించామని, సేకరించిన సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించామన్నారు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నామని, బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందనే వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. గుజరాత్ లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని… తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023 లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు.మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.