నెత్తిన నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు..

గండిపేట వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు.
1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడిందని సీఎం అన్నారు.
వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.
1965 లో మంజీరా నది నుంచి నగరానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తాగు నీరు అందించిందన్నారు.
2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని సీఎం ధ్వజమెత్తారు.
నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవని ఆయన వ్యాఖ్యానించారు.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందన్నారు.