స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి
1 min readతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. క్లిష్ట సమయంలో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఆయన పరపతి బాగా పెరిగింది. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడి గా రేవంత్ రెడ్డి మారారు. సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ కి నమ్మకస్తుడిగా పేరుతెచ్చుకున్నారు. పార్టీ గీసిన గీత ను దాటకుండా తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆయనకు సీనియర్ నేతల నుంచి కూడా మద్దతు ఉంది. ముఖ్యంగా బీజేపీని ఎదుర్కొవడంలో రేవంత్ రెడ్డి చూపిస్తున్న చొరవ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలను ఆకట్టుకుంటోంది. ఆయన వాగ్దాటి పార్టీ యువ నాయకత్వానికి ఆదర్శంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి సేవలను మరింత గా వినియోగించుకోవడానికి హైకమాండ్ ప్రయత్నిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అక్కడికి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా పంపిస్తోంది. తాజా మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చోటు కల్పించారు. మహారాష్ట్రలో అధికారం సాధించడమే ధ్యేయంగా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలను సంధిస్తోంది. మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు.
మహారాష్ట్రలో భివాండి, కండివలి, బృహన్ముంబైలోని మహిమ్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు షోలాపూర్, జల్నా, అహ్మద్‌నగర్, నాందేడ్ మరియు చంద్రపూర్ వంటి సెగ్మెంట్లలో తెలుగు వారు అధికంగా ఉన్నారు. వర్లీ నుంచి శివసేన కీలక నేత ఆదిత్య థాకరే పోటీ చేస్తున్నారు. ఇక్కడ తెలుగు వారి ఓట్లు 30 వేల వరకు ఉన్నాయి. ముంబై నగరంలోని నవీ ముంబై, థానేలలో వర్లీ, బోరివలి, కమాటిపురా, ఘట్కోపర్, కొలాబా, బాంద్రా, గోరేగావ్ మరియు ఆంటోప్ హిల్ వంటి ప్రాంతాల్లో దాదాపు 10-12 లక్షల మంది తెలుగువారు ఉన్నట్లు అంచనా. ఇక తెలంగాణకు చెందిన లక్షల మంది షోలాపూర్‌లో స్థిరపడ్డారు. సోలాపూర్ సిటీ నార్త్, సోలాపూర్ సిటీ సెంట్రల్, షోలాపూర్ సౌత్ అనే మూడు నియోజకవర్గాల్లో దాదాపు ఐదు లక్షల మంది తెలుగువారు నగరంలో ఉన్నారు. ఇక్కడ సీపీఎం తో పాటు శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ముంబయి, షోలాపూర్ తో పాటు తెలంగాణ సరిహద్దు ఉన్న జిల్లాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నది. ముంబయి తో పాటు సోలాపూర్ లో రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ముఖ్యమంత్రి ప్రచారం తో ఇక్కడ కాంగ్రెస్ కు మంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.