జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి

1 min read

రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది.

జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత యాజమాన్యంతో సమావేశమైంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని జైకాను కోరింది.

పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలు, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో వివరించారు.

కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రూ. 24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని జైకా బృందానికి వివరించారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం.. అంటే రూ.11,693 కోట్లు. రుణం అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుందని చెప్పారు. మెట్రో తో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు మరియు కొత్త రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి కోరారు.

హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే తన ఆలోచనలను ముఖ్యమంత్రి వారితో పంచుకున్నారు.

జైకాకు, తెలంగాణతో ఏళ్లకేళ్లుగా సంబంధాలున్నాయని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ షోహెయ్ హరా అన్నారు. మెట్రో రైలు విస్తరణతో పాటు, అర్హతలున్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn