ప్రపంచంతో తెలంగాణ పోటీ.. జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి
1 min read
ఈ తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశంలోని తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతిని తెలంగాణ సాధించిందని ఆయన అన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని సీఎం వివరించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామన్న ఆయన నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే.. మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. అందుకే హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయాలని తాను భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని ఆయన వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగితే తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుందన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.