కేరళ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి.. కమ్యూనిస్టుల పైన సీరియస్ కామెంట్స్

ఎల్డీఎఫ్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే…
* కమ్యూనలిస్టు మోదీ… కమ్యూనిస్టు విజయన్ ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు
* కేరళంలో బీజేపీకి లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్‌నే..
* ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* ఆకట్టుకున్న ముఖ్యమంత్రి ప్రసంగాలు…
తిరువనంతపురం: కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ… తివేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు వస్తాయన్నారు. మోదీ-విజయన్ వి విభిన్న భావజాలాలైనా… భావాలొక్కటేనని, ఎల్డీఎఫ్.. బీజేపీల మధ్య ఒప్పందాలు ఉన్నాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని సభల్లోనూ ముఖ్యమంత్రి ప్రసంగాలకు భారీ స్పందన లభించింది. నేమం నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ తరఫున పూంథురలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్లను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్ నే అన్నారు. కేరళలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నోరుమెదపడం లేదని ఆయన మండిపడ్డారు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్కు గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. బీజేపీ-సీపీఎం మధ్య సైలెంట్ అండర్స్ట్రాండింగ్ ఉందని అన్నారు. అందుకే వారిపై ఎటువంటి కేసులు ఉండవని విమర్శించారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తారని… కానీ, విజయన్ సర్కారుపై ఇగ కూడా వాలనీయరని ఆగ్రహించారు. బీజేపీ, ఎల్డీఎఫ్ బయటకు పోటీ పడుతున్నట్టు కనిపించినా, అది ఉత్తిత్తిదేనని చెప్పారు. కేరళం సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యమన్నారు. విద్యావంతులైన ఎందరో మలయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తగిన సంఖ్యలో లేవన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కేరళం సమగ్రాభివృద్ధికి యూడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని రేవంత్ పిలుపునిచ్చారు. హస్తం పార్టీకి ఓటేస్తే పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీ ఇచ్చారు. డెవలప్మెంట్ విత్ డిగ్నిటీతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
* కాంగ్రెస్ ముఖ్యమంత్రలవి నిష్కళంక రాజకీయాలు…
సామాజిక ప్రగతి, అభివృద్ధి, అక్షరాస్యతలో కేరళం ఎప్పటినుంచో యావత్ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని, అందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కృషే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగంలో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళంకు ఉన్న గుర్తింపును రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. విద్యా, అవగాహన, సామాజిక చైతన్యంలో కేరళం దేశానికి అప్పటికీ, ఇప్పటికీ నమూనాగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీ, ఏకే ఆంటోనీల కృషి ప్రధాన కారణమన్నారు. వాళ్లు కేరళంకు సమగ్ర, సమ్మిళిత, సమతుల్య, నిష్కళంక రాజకీయాలను అందించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కరుణాకరన్ కేరళలో అభివృద్ధికి బాటలు వేశారని, ఊమెన్ చాందీ సంక్షేమం-అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చారని, ఏకే. ఆంటోనీ నిజాయితీకి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో కేరళంకు గౌరవం, నమ్మకం, పరిపాలనా స్థిరత్వం వచ్చిందన్నారు. కేరళంను “గాడ్స్ ఓన్ కంట్రీ” గా పిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే, దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా కేరళం ఒక బ్రాండ్‌గా నిలిచిందన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్యం, సామాజిక పురోగతి- ఇవన్నీ కేరళంను ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయన్నారు.
* అక్కడా.. ఇక్కడా వైఫ్యలం..
గత 12 ఏండ్లుగా ఢిల్లీలో… 10 ఏండ్లుగా కేరళంలో పరిస్థితులను పూర్తిగా దిగజారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోడీ, కేరళంలో విజయన్ “డబుల్ ఫెయిల్యూర్”గా నిలిచారని సీఎం విమర్శించారు. ఢిల్లీలో మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం, తిరువనంతపురంలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారులో దేశం, రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లాయని విమర్శించారు. వీరి ఇరువురి సిద్ధాంతాలు వేరు అయినా… వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.
* తెలంగాణ బాటలో కేరళం..
సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళం కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళం అభివృద్ధికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళం కుటుంబ సభ్యుల్లా మారారని సీఎం తెలిపారు.
* విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో….
మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నరసింహం సినిమాలో చెప్పిన “నీ పో మోనే.. దినేశా..” స్టైల్లో “నీ పో మోనే విజయన్.. యువర్ టైమ్ ఈజ్ ఓవర్” (విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో) అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగ్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. మలయాళంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుకరించడంతో యువత నుంచి భారీ స్పందన లభించింది. యంగ్ సీఎం… డైనమిక్ సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
