ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ ..
1 min read
* వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయండి…
* హైదరాబాద్-బెంగళూరు ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయండి..
* కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
ఢిల్లీ: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు ట్రస్ట్ (NICDIT) ఆమోదించిన రూ.596.61 కోట్లను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం అభ్యర్ధించారు. హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేసిందని… ఈ నేపథ్యంలో హైదరాబాద్-బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గోయల్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.