దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి .. ఒప్పందాల వెల్లువ

1 min read

రాష్ట్రంలో యూనీ లివర్ యూనిట్లు

పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్

బాటిల్ క్యాప్ ల తయారీ యూనిట్

దావోస్ వరల్డ్ ఎకనమిక్​ ఫోరమ్​ సదస్సులో తొలి ఒప్పందం

తెలంగాణలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ ముందుకొచ్చింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు యూని లీవర్ సీఈఓ హీన్ షూ మేకర్‌, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలో పేరొందిన యూనిలీవర్ మన దేశంలో హిందూస్తాన్ లివర్‌ పేరిట వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తోంది. ఈ చర్చల సందర్బంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను వివరించారు.

దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ వారధిగా ఉంటుందని, అనుకూల వాతావరణంతో పాటు తూర్ప పడమరన ఉన్న మిగతా రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉంటుందని అన్నారు. పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటకు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వారితో పంచుకున్నారు.

తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, సులభతర వ్యాపార విధానాలు అదనపు బలంగా ఉంటాయని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2050 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళిక ప్రపంచంలో అత్యుత్తమంగా అందరినీ ఆకర్షిస్తుందన్నారు.

దేశంలో యూనిలీవర్ తయారీ కేంద్రాలున్నప్పటికీ.. ఈ కంపెనీ తెలంగాణలో విస్తరించలేదు. దేశంలో అత్యధికంగా విస్తరణ అవకాశాలున్న వాటిపై దృష్టి సారించి, అటువంటి రంగాల్లోనే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

స్పందించిన యూని లీవర్ సీఈవో తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రీ ఫైనింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

యూని లీవర్ బృందం బాటిల్ క్యాప్‌లను ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. యూని లీవర్ ఉత్పత్తులు ఎక్కువగా ద్రవ రూపంలో సీసాలలో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం ఈ బాటిల్ క్యాప్ లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసే యూనిట్ వీటి కొరతను తీర్చనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn