తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్నంగా పరిపాలన చేస్తున్నారు. ప్రజా పాలన తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముందు దుబారా ను అరికడుతున్నారు. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము ను విందులు, విలాసాలకు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన కాన్వాయ్ ను పూర్తిగా మార్చేశారు. గత సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో అత్యాధునిక ల్యాండ్ క్రూజర్ వాహనాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. వాటితో పాటు మరో 20 కి పైగా బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ను విజయవాడలో తయారు చేయించి సరికొత్త కాన్వాయ్ కోసం సిద్ధం చేశారు. కాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కాన్వాయ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా రాష్ట్రానికి కొత్త సీఎం వస్తే ఆయన సూచనల ప్రకారం సరికొత్త వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. కాని రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ఉపయోగించిన కాన్వాయ్ లోని వాహనాలనే కొనసాగిస్తున్నారు. కాన్వాయ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించేది ఆయన సొంత ల్యాండ్ క్రూజర్ కావడం విశేషం.
మరోవైపు ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తున్న సమయంలో ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేస్తారు. భద్రతా కారణాలతో పాటు సమయపాలన కోసం ట్రాఫిక్ ను ఆపేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో తన కోసం ట్రాఫిక్ నిలిపేయవద్దని చెప్పారు. అయితే రోడ్డు పైన వాహనదారుల నుంచి వస్తున్న ఇబ్బందులతో కొన్ని రోజులకే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను నిలిపేసి వాహనదారులను ఇబ్బంది పెట్టడం అసలు ఇష్టం లేదు. అందుకే తన కాన్వాయ్ కేవలం 9 వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు. అయినప్పటికీ కొన్ని సార్లు ట్రాఫిక్ ను ఎక్కువ సమయం ఆపేస్తుండటంతో తాజా గా రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపేయవద్దని అధికారులను ఆదేశించారు. కేవలం గ్రీన్ ఛానల్ మాత్రమే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రయాణించేటప్పుడు అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు సాగేలా చూస్తారు.అడ్డుగా వచ్చే వాహనాలను పక్కకు తప్పిస్తూ కాన్వాయ్ ను ముందుకు తీసుకెళ్తారు. సాధారణంగా క్యాబినెట్ మినిస్టర్స్ కు ఈ సదుపాయం కల్పిస్తుంటారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కాన్వాయ్ సాధారణ వాహనాల మధ్యే ప్రయాణం చేస్తోంది. దీని వల్ల ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రత కు ప్రమాదం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఎం వాహనానికి అతి దగ్గరగా ఇతర వాహనాలు వస్తుండటంతో సెక్యూరిటీ సిబ్బంది లో టెన్షన్ కనిపిస్తోంది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన భద్రత కంటే సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉండటమే ముఖ్యమని భావిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేయడం తో నరకం చూసిన హైదరాబాద్ వాసులు ఇప్పుడు ఊపిరిపీల్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వాహనంతో పాటు తాము ప్రయాణిస్తూ ఆనందపడుతున్నారు.