పొంగులేటి, జూపల్లిపైన కేసీఆర్ వేటు
1 min readమాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావుపైన బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారంటు సస్పెండ్ చేసింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో దీనిపైన ప్రకటనను విడుదల చేసింది. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళంలో సిఎం కేసీఆర్ పైన పొంగులేటి, జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అహంకారంతో వ్యవహారిస్తున్నారని,అవినీతి ప్రభుత్వం అంటు నిప్పులు చెరిగారు. దీనిపైన బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉండటంతో పాటు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కొల్లాపూర్ లో జూపల్లి క్రిష్ణరావు కూడా ఎమ్మెల్యే హర్షవర్థన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొన్నది. మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకున్నప్పటికి వివాదం సద్దుమణగలేదు. ఇదే సమయంలో జూపల్లిని వదిలించుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ రాదని నిర్ణయించుకున్న క్రిష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెఢీ అయ్యారు. ఈ సమయంలో ఆయనపైన వేటు పడింది.
అయితే జూపల్లి, పొంగులేటి ఏ పార్టీలో చేరతారన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీలో చేరతానని ఇప్పటికే పొంగులేటి ప్రకటించారు. ఆ పార్టీ ఏదన్నది త్వరలోనే తేలనున్నది. మరో వైపు జూపల్లి, పొంగులేటితో పాటు మరికొందరు కలిసి కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.