వరంగల్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ
1 min read
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావొస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా.. వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్టు కేసీఆర్ గారు తెలిపారు.
ఈ మేరకు ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం నాడు జరిగిన కీలక సమావేశంలో ఇందుకు సంబంధించి సుధీర్ఘ చర్చ జరిగింది.
ఈ సంధర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో స్వరాష్ట్రంలో పాలనను దేశానికే ఆదర్శంగా నిలుపుకున్నామని, అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవ్వాళ కష్టాల్లో వుందన్నారు.ఇటువంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం వుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ.. ప్రజలు బీఆర్ఎస్ ను తెలంగాణ పార్టీగా తమ సొంత ఇంటి పార్టీగా భావిస్తారు. ప్రజలు ఇవ్వాళ అనేక కష్టాల్లో వున్నారు. వారి రక్షణ బీఆర్ఎస్ పార్టీనే అని నమ్ముతున్నారు అని తెలిపారు.

