సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో అల్లర్లకు బీఆర్ఎస్ చేసిన కుట్ర బయట పడింది. లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద దాడి చేసిన వారి వెనుక ఆ పార్టీ హస్తముందని తేలింది. దాడి కి సూత్రధారి అయిన బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు సురేష్ తో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సంబంధాలను పోలీసులు వెలికి తీశారు. దాడికి ముందు సురేష్ తో నరేందర్ రెడ్డి 40 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు బయటపడింది. నరేందర్ రెడ్డి సూచనలతోనే లగచర్లలో కలెక్టర్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని పోలీసుల అనుమానిస్తున్నారు. సురేష్, నరేందర్ రెడ్డి కలిసి దాడికి కుట్ర చేశారన్న దానికి పక్కా ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో నరేందర్ రెడ్డి ని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో వైపు దాడి ఘటన కు ముందు నరేందర్ రెడ్డి తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫోన్లో మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
లగచర్ల లో కలెక్టర్ , ఇతర ఉన్నతాధికారుల పైన దాడి కేసులో ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో 50 మంది ని అదుపులోకి తీసుకున్న పోలీసులు 16 మంది ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు సురేష్ రాజ్ ప్రస్తుత పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక టీం లతో గాలిస్తున్నారు. సురేష్ రాజ్ పైన మూడు నాన్ బెయిలబుల్ కేసు లు నమోదు చేశారు. హైదరాబాద్ మణికొండ లో నివాసం ఉంటున్న సురేష్ రాజ్ గత కొన్ని రోజులు లగచర్ల లో ఉంటు స్థానికులను రెచ్చగొడుతున్న ట్లు పోలీసులు గుర్తించారు. అధికారులపై దాడి చేశాయాలన్న ఉద్దేశంతో సురేష్ వారిని లగచర్ల గ్రామంలోకి తీసుకెళ్లినట్లు ఇప్పటికే ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే సురేష్ రాజ్ వెనుక ఉన్న వారెవ్వరు అన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన వాట్సాప్ కాల్స్ ను బయటకు తీస్తున్నట్లు సమాచారం.
ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు లగచర్ల కు వెళ్లినప్పుడు వారి పైన దాడి జరిగింది. దీని పైన ప్రభుత్వం సీరియస్ రియాక్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో అల్లర్లు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలనే కట్ర జరిగిందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత్తం జరుగుతున్న విచారణలో పెద్ద తలకాయలు బయటపడితే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముంది.