ఈటెల రాజేందర్ సానుభూతి అస్త్రం
1 min readహుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఏదో విధంగా గెలవడానికి పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సామాన్య ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎక్కడికి వరకైనా వెళ్లడానికి సిద్ధమౌతున్నాయి. హుజూరాబాద్ లో సానుభూతి అనే అస్త్రం ప్రధానంగా ఉపయోగపడుతుందనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పైన ఓటర్లు సింపతి చూపిస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ తనను అన్యాయంగా మంత్రి వర్గం నుంచి తొలగించారన్న దానిపైన సానుభూతి ఖాయమని ఈటెల భావిస్తున్నారు. ఇదే సమయంలో మరింత సానుభూతి కూడగట్టుకునేందుకు ఆయన రకరకాల ప్రకటనలు గుప్పిస్తున్నారు. తనపైన దాడి జరిగే అవకాశముందని రాజేందర్ ఇటీవల వ్యాఖ్యానించారు. చంపడానికి కుట్ర చేస్తున్నారని గతంలో కూడా ఆరోపణలు చేశారు. దీంతో టీఆర్ఎస్ వర్గాలు ఈటెల తీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సానుభూతి కోసం మాజీ మంత్రి కుట్రలకు తెర తీస్తున్నారని గులాబీ నేతలు అంటున్నారు. తనపైన దాడి చేయించుకొని టీఆర్ఎస్ పైన నెట్టే ఆలోచనలో ఈటెల రాజేందర్ ఉన్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో రఘనందన్ రావు కూడా ఇలాంటి వ్యూహాం ద్వారానే ఓట్లు సంపాదించుకున్నారని అధికార పార్టీ వర్గాలంటున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన తలపైన తానే రాయితో కొట్టుకొని పోలీసులపైకి నెట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేస్తున్నారు. పోలింగ్ నాటికి బీజేపీ సానుభూతి వ్యూహాన్ని అమలుపర్చి తమను బద్నాం చేసే ఆలోచన ఉందని, పోలీసు యంత్రాంగం దీనిపైన ద్రుష్టి పెట్టాలని గులాబీ నేతలు సూచిస్తున్నారు.