బీసీలను పక్కన పెట్టి ఓసీలకు బీజేపీ అధ్యక్ష పీఠాలు
1 min readరెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ అధిష్టానం మార్చింది. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు ప్రెసిడెంట్లను తప్పించి అగ్రవర్గాలకు చెందిన నేతలకు అప్పగించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. కేవలం నెల రోజుల్లోనే అనుహ్యంగా పరిణమాలు మారి బండి సీటకు ఎసరు పెట్టాయి. పార్టీ ముఖ్యనాయకుల ఫిర్యాదులతో సంజయ్ ను పార్టీ అధ్యక్షపదవి నుంచి పక్కకు తప్పించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. గతంలో రెండు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఈటెల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. సోమువీర్రాజు స్థానంలో ఆమెకు పార్టీ అవకాశం కల్పించింది. గత మూడేళ్లుగా ఎపిలో బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. ఎపి సిఎం జగన్ కు అనుకూలవర్గంగా సోమువీర్రాజుపైన ముద్రపడింది. వైసీపీ కాకుండా ప్రతిపక్ష తెలుగుదేశంపైనే ఆయన విమర్శలు ఎక్కువగా చేసేవారు. తిరిగి బీజేపీని గాడిలో పెట్టాలని భావించిన పార్టీ హైకమాండ్ కమ్మ సామాజికవర్గానికి చెందిన పురందేశ్వరి వైపు మొగ్గు చూపించింది. ఎన్టీఆర్ కుమార్తె గా పురందేశ్వరికి ఎపిలో మంచి క్రేజ్ ఉంది.
ఇద్దరు బీసీలను పక్కకు పెట్టి అగ్రవర్గాలకు రెండు రాష్ట్రాలను అప్పగించడంపైన రాజకీయ విమర్శలు ప్రారంభమయ్యాయి. భారతీయ జనతా పార్టీలో బడుగుబలహీన వర్గాలకు స్థానం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. కేసీఆర్ సూచనల మేరకే బండి సంజయ్ ని పక్కన పెట్టి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ గా నియమించారని ఆ పార్టీ స్పష్టం చేసింది.