మహారాష్ట్రలో ఓవైసీ మాస్టర్ ప్లాన్

1 min read

ఎంఐఎం అధినేత అసదుద్దీన్, ఇటీవల టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. తమ సపోర్టుతోనే గతంలో టీఆర్ఎస్ పలు సీట్లు గెలిచిందని చెప్పడంతోపాటు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపడుతోందని ఆరోపించారు. గతంలో తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో బాగానే ఉన్న ఎంఐఎం పార్టీ..సడెన్ గా టీఆర్ఎస్ పై విమర్శలు చేయడం ఏంటనే చర్చ మొదలైంది. సమీపకాలంలో రెండు తెలుగురాష్ట్రాల్లో ఎలాంటి ఎన్నికలు లేవని, అలాంటప్పుడు ఓవైసీ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటనే చర్చకూడా నడుస్తోంది. అయితే ఓవైసీ వ్యాఖ్యల వెనుక పెద్ద ప్లానింగే ఉందని చెబుతున్నారు. అదేంటో చూద్దాం.
మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న ఫలితాలు రానున్నాయి. ఎంఐఎం పార్టీకి మహారాష్ట్ర ఎన్నికలు చాలా ముక్యమైనవి. ఆ పార్టీ గతంలో ఇక్కడ కొన్ని సీట్లు గెలుచుకుంది కూడా. 2019లో 44సీట్లలో పోటీచేసి రెండుచోట్ల గెలిచింది. ఈ ఎన్నికల్లో 16స్థానాల్లో పోటీచేస్తోంది. గత పదేళ్లలో ఇంత తక్కువ స్థానాల్లో పోటీచేయడం ఇదే తొలిసారి అయినప్పటికీ, ఈ సారి కనీసం ఐదుసీట్లు గెలిచినా.. కింగ్ మేకర్ కావచ్చని భావిస్తోంది. అందుకే తన స్టాండ్ ను మార్చుకుంది. అదే సమయంలో లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ కు దూరంగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వడం కూడా వ్యూహంలో భాగమని చెప్పవచ్చు. అంతేకాకుండా రానున్న కాలంలో జరిగే ధిల్లీ ఎన్నికలను కూడా ద్రుష్టిలో పెట్టుని ఓవైపీ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.

 

ఇక మహారాష్ట్రలో ఐదుసీట్లు గెలిచినా కింగ్ మేకర్ ఎలా అవుతారు అనే విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 2019తో పోల్చితే ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. శివసేన పార్టీలో, NCPలో చీలికలు వచ్చాయి. ఆయా వర్గాలు రెండు కూటములనుంచి పోటీచేస్తున్నాయి. దీంతో ఈ సారి మహాయుద్ధమే అని చెప్పవచ్చు.288 స్థానాలున్న మహారాష్ట్ర లో అధికారంలోకి రావాలంటే 145సీట్లు గెలవాలి. ఈ ఎన్నికల్లో రెండు కూటములు పోటీపడుతున్నాయి. అవి మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడీ. ఇక మహాయుతి కూటమిలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే నడుపుతున్న శివసేన, అజిత్ పవార్ నడుపుతున్న NCP తోపాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ లో కాంగ్రెస్ పార్టీ, ఉద్దవ్ థాక్రే నడుపుతున్న శివసేన-UBT, శరద్ పవార్- జయంత్ పాటిల్ నడుపుతున్న NCP, సీపీఐ, సీపీఎం, సమాజ్ వాదీ పార్టీలున్నాయి. బీఎస్పీ, ఎంఐఎం లాంటి పార్టీలు ఒంటరిగా పోటీచేస్తున్నాయి.అయితే ప్రస్తుతం వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో.. ఏ కూటమికి కూడా 150-160కి మించి సీట్లు రావని తేలడంతోపాటు అందులోనూ 10నుంచి 20సీట్లు టైట్ ఫైట్ ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి ఫలితాలు అటూ ఇటూ కావచ్చు. అదే జరిగే రెండుమూడు సీట్లు గెలుచుకున్న పార్టీలు, ఇండిపెండెంట్ లు కింగ్ మేకర్లుగా ఉండే చాన్స్ ఉందని సర్వేలు తేల్చాయి. ఇక RSS ఇటీవల స్వయంగా నిర్వహించిన అంతర్గత సర్వేలో కూడా బీజేపీ 90నుంచి95 సీట్లు గెలుస్తుందని తేలిందట. అంటే బీజేపీ పోటీచేసిన సీట్లలోనే దాదాపు 40సీట్లలో ఓడిపోతుందని తేలింది. ఇక సీ-ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో శివసేనలోని ఏక్ నాథ్ శిండే వర్గం, ఉద్దవ్ థాక్రే వర్గం మధ్య ఓట్ల తేడా కేవలం 4.8శాతం మాత్రమే ఉంటుందని, దీన్ని బట్టి ఫలితాలు ఎటైనా మారవచ్చని తేలింది.

సర్వే ఫలితాలు- అంచనాలు ఇలా ఉంటే, వారంనుంచి మహాయుతి కూటమికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మహారాష్ట్రలో కీలకమైన బొరివాలి, ముంబాదేవి, వర్లి , బాంద్రా స్థానంలో బీజేపీ రెబెల్స్ బరిలోకి దిగారు. వారు బీజేపీ కూటమి ఓట్లను చీల్చనున్నారు. ఈ అంశాలే కాకుండా ఔరంగాబాద్, పూణె, లాతూర్, నాందేడ్, షిర్డి, భీవండి, ముంబాదేవి నియోజకవర్గ ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఉన్నారు. వారిలో కొందరు గతంలో బీఆర్ఎస్ కు మద్దతు పలికారు. ఇప్పుడు టీఆర్ఎస్ అక్కడ పోటీలో లేదు కాబట్టి వారు తటస్థులుగా మారారు. దీంతో ఈ తటస్థ ఓటర్లు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లు, మైనార్టీ ఓటర్లపై ఎంఐఎం ద్రుష్టి పెట్టింది. ఆ ఓటు బీజేపీ కూటమివైపు వెళ్లకుండా కాంగ్రెస్ కూటమికి పడేలా చేయడమే ఈ వ్యూహంలో భాగమని తెలుస్తోంది.

వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీకి ఒక రూపు రాగానే ఎంఐఎం ఆ కూటమిలో చేరేందుకు విశ్వప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆ టైంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ను కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఆయన ఓ మీటింగ్ లో మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే నేత్రుత్వంలోని శివసేన-UBT సెక్యూలర్ పార్టీగా మారిందని, కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ అని, అందుకే ఆ పార్టీలతో కలిసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. కాని ఎంఐఎం పార్టీ 28సీట్లను అడగడంతో పొత్తు కుదరలేదు. చివరికి ఒంటరిగా 16సీట్లలో సొంతంగా పోటీ చేస్తోంది. అయితే 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కూటమి కూడా కొంత సానుకూలంగా వ్యవహరించిందని చెబుతున్నారు. ఎంఐఎం పోటీ చేస్తున్న, మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్న ఐదారు సెగ్మెంట్లలో కాంగ్రెస్ కూటమి బలహీన అభ్యర్థులను పెట్టిందట. దీన్ని బట్టి కాంగ్రెస్ కూటమి-ఎంఐఎం డైరెక్ట్ గా పొత్తులో లేకున్నా ఇన్ డైరెక్ట్ గా సపోర్టు ఉందని చెప్పవచ్చు. ఈ సమీకరణాల నేపథ్యంలో కనీసం మూడునుంచి ఐదు సీట్లు గెలిచినా ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో కీలకంగా మారుతున్నాయనే అంచనాలున్నందునే ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది. అయితే అసదుద్దీన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది తేలాలంటే నవంబరు 23 వరకు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn