టీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
1 min read
వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమదే అధికారమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తున్నప్పటికి టీఆర్ఎస్ అసంత్రుప్త నేతలు మాత్రం తమ దారి తాము చేసుకునే పనిలో పడుతున్నారు. చంద్రశేఖర్ రావు ఆశీస్సుల కోసం ఎదురు చూసి భంగపడిన నాయకులు ప్రత్యామ్నాయాలు వెతుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవచ్చునని బలంగా నమ్ముతున్న అసంత్రుప్త నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెపుతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కొంత మంది సీనియర్లు కూడా తమ భవిష్యత్తుపైన మల్లగుల్లాలు పడుతున్నారు.అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ మీద చర్చిస్తున్నారు. వచ్చే ఆరునెలల్లో అసంత్రుప్త సీనియర్లు తమ రాజకీయ భవిష్యత్తును ఖరారు చేసుకునే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో ఇతర పార్టీలో టిక్కెట్లు ఖాయం చేసుకుంటున్న నాయకులు జంప్ అవుతున్నారు. తాజాగా యాదాద్రి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు. ఒక వైపు కేసీఆర్ యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సమయంలోనే స్థానిక నేత గులాబీ పార్టీని వదిలివెళ్తుడటం విశేషం. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. 2009లో ఆయన కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014,18ల్లో కూడా కాంగ్రెస్ టిక్కెట్ పైన పోటీ చేసిన బిక్షమయ్య టీఆర్ఎస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు గుడ్ చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీతో బిక్షమయ్య గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే క్రమంగా పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో పాటు ఎలాంటి నామినేటేడ్ పదవి ఇవ్వకపోవడంతో బిక్షమయ్య గత కొన్నాళ్లుగా అసంత్రుప్తిగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న అంచనాకు వచ్చిన ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పలు దఫాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఉగాధి తర్వాత బిక్షమయ్య ఢిల్లీకి వెళ్లి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆలేరు టిక్కెట్ ఇస్తామని బీజేపీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.