జగ్గారెడ్డి భవిష్యత్ ఏమిటీ… ?
1 min readకాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కత సుఖాంతం అయినట్లే కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన అసమ్మతి గళాన్ని విప్పుతున్న ఆయన.. ఢిల్లీ టూర్ తో శాంతించారు. రాహుల్ గాంధీ మీటింగ్ తో జగ్గారెడ్డి కూల్ డౌన్ అయ్యారు. తన రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. రాహుల్ గాంధీని చూసిన తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. సమావేశంలో రేవంత్ రెడ్డిపైన ఆయన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ తో జగ్గారెడ్డి కుటుంబంతో సహా భేటీ అయ్యారు. గతంలో మాణిక్యం ఠాగూర్ పైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి పట్టించుకోవడం లేదంటు వ్యాఖ్యానించారు. దీంతో వీరిద్దరి మధ్య కూడా గ్యాప్ పెరిగింది. కాని ఇఫ్పుడు మాణిక్యం ఠాగూర్ ను జగ్గారెడ్డి కలవడంతో కథకు శుభం కార్డు పడిటన్లైంది. మరో వైపు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపైన, రేవంత్ రెడ్డి తీరు మీద ఆయనకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను వేణుగోపాల్ కు జగ్గారెడ్డి వివరించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ సమావేశం జరిగింది. కుటుంబసమేతంగా రాహుల్ గాంధీతో కూడా జగ్గారెడ్డి కలిసే అవకాశముంది. అయితే ఆ భేటీలో రేవంత్ రెడ్డిపైన ఫిర్యాదు చేస్తారా లేక మర్యాదపూర్వకంగా కలిసి వస్తారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి తాజా ఢిల్లీ టూర్ తో జగ్గారెడ్డి ఎపిసోడ్ కు తాత్కాలికంగా ముగింపు దొరికింది. అయితే ఇది ఎంత కాలం అన్నది మాత్రం చూడాల్సి ఉంది.
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అసంత్రుప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పటికి ఆయన శాంతించలేదు. వీలు దొరికినప్పడల్లా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని దుమ్మెత్తిపోశారు. తనను గౌరవించడం లేదని, వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నారని మీడియా ముందు విమర్శలు చేశారు. ఒక దశలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని అంతా బావించారు కూడా. అయితే సంగారెడ్డి కేడర్ ఎదురుతిరగడంతో జగ్గారెడ్డి పునరాలోచనలో పడ్డారు. పార్టీ మార్పుపైన ద్వితీయ శ్రేణి నేతలు ససేమేరా అనడంతో ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మొండి పట్టుదలకు పోయి పార్టీ మారితే రెంటికి చెడ్డ రేవడిలా అవుతానన్న భయం జగ్గారెడ్డిలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే విలక్షణ రాజకీయాలు చేసే జగ్గారెడ్డి ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియని పరిస్థితి. భవిష్యత్తులో ఆయన నిలకడగా వ్యవహారిస్తారా లేక అసమ్మతిని కొనసాగిస్తారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.