ఫ్రెంటూ లేదూ…టెంటూ లేదూ…కేసీఆర్ ఆశలు గల్లంతు
1 min read
వి.ఎస్.ఆర్, ఎడిటర్
బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఫ్రెంట్ కు ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు ముందుకు సాగడం లేదు. ప్రాంతీయ పార్టీలన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్న కేసీఆర్ ఆలోచనలు అంత సులువు కాదని అర్థమౌతోంది. గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేసి తర్వాత చేతులెత్తేసిన చంద్రశేఖర రావు మళ్ళీ ఇప్పుడు రాయబారాలు మొదలు పెట్టారు. బీజేపీ వ్యతిరేకతే ప్రధాన ఎజెండాగా ఆయన పార్టీలను కలుపుకునే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలతో చెలిమి కోసం ఆయన ప్రత్యేక విమానంతో బయలుదేరారు. మహారాష్ట్ర వెళ్లి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమైన కేసీఆర్ తాజాగా జార్ఖండ్ సిఎం హేమంత్ సొరెన్ ను కలిశారు. తమిళనాడు సిఎం స్టాలిన్ , పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా సిఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆర్డేడీ నేత తేశ్వసి యాదవ్ , జనతా దళ్ నేత దేవేగౌడ, ఎన్సీపీ నేత శరద్ పవర్, వామపక్ష నాయకులు .. ఇలా ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ నాయకులను కలుపుకొని ఫ్రెంట్ కు రూపురేఖలు ఇవ్వాలని చంద్రశేఖర్ రావు ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే ఇప్పటి వరకు చంద్రశేఖర్ రావు చేసిన పర్యటనలను పరిశీలిస్తే ఆయన ఫ్రెంట్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. బీజేపీ వ్యతిరేక శక్తుల ఏకీకరణ కు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయకపోనప్పటికి కాంగ్రెస్ ను దూరం పెట్టే ఆలోచనలకు మాత్రం ఈ పార్టీలు సిద్దంగా లేవు. మహారాష్ట్రలో సిఎం ఉద్దవ్ ఠాక్రేను కేసీఆర్ కలిసి వచ్చిన వెంటనే కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రెంట్ ఏర్పాటు సాధ్యం కాదని శివసేన ఎంపి తేల్చి చెప్పారు. తాజాగా ఝర్ఖండ్ సిఎం హేమంత్ సొరెన్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అసలు సొరెన్ ప్రభుత్వం కొనసాగుతుందే కాంగ్రెస్ మద్దతుతో. జెఎంఎం ప్రభుత్వానికి 18 కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు అత్యంత అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్ తో సొరెన్ చేతులు కలిపే అవకాశమే లేదు. దీంతో రాంచీ పర్యటనలో చంద్రశేఖర్ రావుకు ఆశించిన ఫలితమేది రాలేదు. కేసీఆర్ ఫ్రెంట్ ప్రయత్నాలపైన హేమంత్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో కూడా సొరెన్ ఎక్కువ సేపు కూర్చొవడానికి ఇష్టపడ లేదు.దీంతో ఫ్రెంట్ ఆలోచన ప్రస్తుతానికి లేదని చంద్రశేఖర్ రావు చెప్పుకోవాల్సి వచ్చింది.
తన ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ అవుతారని ప్రగతి భవన్ వర్గాలు లీక్ ఇచ్చాయి. అయితే ఈ భేటీ జరగలేదు. కనీసం కేజ్రీవాల్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయనను కలవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించ లేదు. దీనికి తోడు ఆమ్ ఆద్మీ కీలక నేత సోమ్ నాథ్ భారతీ చంద్రశేఖర్ రావు ప్రభుత్వంపైన అత్యంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఫ్రెంట్ అవసరం లేదన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తు ప్రజా ఫ్రెంట్ ఉంటే చాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయమని, ఈ సారి ఆయన అధికారంలోకి రాడని తేల్చారు. దీంతో కేజ్రీవాల్ పైన చంద్రశేఖర్ రావు పెట్టుకున్న ఆశలు అడుగంటిపోయాయి.
తాజాగా తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమం కూడా కేసీఆర్ ఫ్రెంట్ ప్రయత్నాలపైన నీళ్లు కుమ్మరించింది. తమిళనాడు సిఎం స్టాలిన్ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిధి. కేరళ సిఎం విజయన్, ఆర్జేడీ నేత తేజశ్వసి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ను స్టాలిన్ ఆహ్వానించలేదు. చంద్రశేఖర్ రావు తో తమకు భావసారుప్యత లేదని ఆయన చెప్పకనే చెప్పారు.
ఇలాంటి వాతావరణంలో ఫ్రెంట్ కోసం చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ముందుకు సాగే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను కాదని మరో ఫ్రెంట్ పెట్టే ఆలోచనే ప్రాంతీయ పార్టీలకు లేదన్న విషయం నెమ్మదిగా కేసీఆర్ కు కూడా అర్థమౌతోంది. ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే అప్పుడు మాత్రమే ఏదో ఒక వేదిక తయారు కావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి.