రఘనందన్ రావు అలక ..?
1 min readదుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు అలకబూనినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల వ్యవహారశైలిపైన ఆయన అసంత్రుప్తిగా ఉన్నట్లు సమాచారం. పార్టీ శాసనసభా పక్ష నేత పనితీరు మీద రఘనందన్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతోనే అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. ఈ నెల 7 నుంచి జరిగే శాసనసభాా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపైన చర్చించడానికి బీజేపీ ఎల్పీ భేటీ అయింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లను ఆహ్వానించారు.
బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ తో పాటు ఇటీవల హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ సమావేశానికి హాజరయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు మాత్రం హాజరుకాలేదు. సమావేశం గురించి రెండు రోజుల ముందుగానే ఆయన సమాచారం ఇచ్చినప్పటికి పట్టించుకోకపోవడం విశేషం. దుబ్బాకలో కార్యక్రమాలు ఉన్నందు వల్ల హాజరు కావడం లేదని రఘనందన్ రావు చెప్పుకొచ్చారు. అయితే ఆయన పాల్గొన్న కార్యక్రమాలు అంత ముఖ్యమైనవి కాకపోవడం విశేషం. దుబ్బాకలో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా తనకు అవకాశం ఇవ్వాలని రఘనందన్ రావు కోరుకుంటున్నారు. రాజాసింగ్ కు సరిగా తెలుగు మాట్లాడటం రాదని, విషయ పరిజ్జానం లేదన్నది రఘనందన్ భావన. దీని వల్ల బీజేపీ వాదన పూర్తి స్థాయిలో అసెంబ్లీలో వినిపించలేకపోతున్నామని ఆయన భావిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం సీనియర్ అయిన రాజాసింగ్ వైపే మొగ్గు చూపించింది. తాజాగా ఈటెల రాజేందర్ బీజేపీ తరుపున గెలవడంతో రఘనందన్ రావు శాసనసభాపక్ష నేత ఆశలు ఆడుగంటాయి. రాజాసింగ్ ను పక్కన పెట్టి ఈటెలకు శాసనసభాపక్ష నేత పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. దీనికి తోడు ఇక ముందు అసెంబ్లీలో పార్టీ తరుపున మాట్లాడే అవకాశం ఎక్కువగా ఈటెలకు దక్కనున్నది. ఫలితంగా రఘనందన్ రావు పాత్ర నామమాత్రం మారుతుంది. వీటన్నింటిని ద్రుష్టిలో ఉంచుకొని ఆయన అంటీముట్టనట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో, పార్టీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.