రేవంత్ రెడ్డి పాదయాత్ర ..?

1 min read

తెలంగాణలో పాదయాత్రలపైన చర్చ మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న అంచనాకు వచ్చిన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించాయి. కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పార్టీలు భావిస్తున్నాయి.ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడతల వారి పాదయాత్రను మొదలు పెట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన తొలి దశ పాదయాత్రను ముగించారు. ఏప్రిల్ లో రెండో విడత యాత్రకు ఆయన సిద్ధమౌతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో పాదయాత్రపైన చర్చ మొదలైంది. వీలైనంత త్వరగా జనంలోకి వెళ్లాలన్న ఆలోచన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అయితే ఎవరు పాదయాత్ర చేయాలన్న దానిపైన ఇప్పుడు కాంగ్రెస్ లో మల్లగుల్లాలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సిద్ధం కావాలని ఇటీవల మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో కీలకమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చిన్నారెడ్డి ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే ఆయన ప్రతిపాదనపైన ఇతర సీనియర్లు స్పందించలేదు. దీనిపైన మరో సారి చర్చ జరిగే అవకాశముంది.

తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి పాదయాత్ర పైన రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నడుస్తానని ఆయన ఇప్పటికే పలువురు సార్లు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్రకు అడ్డంకులు మొదలయ్యాయి. ఆయన ఈ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా మిగిలిన సీనియర్లు కూడా తాము పాదయాత్ర చేస్తామని ముందుకు వచ్చారు. దీంతో అధిష్టానం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ముందుండి నడిపిస్తున్నారు. ఆయన పాదయాత్ర చేస్తేనే పార్టీకి అధికారం వస్తుందని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి తోడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ కారణంగా ప్రతి చోట పాదయాత్ర విజయవంతం అవుతుందనే అభిప్రాయం ఉంది. తన వాగ్దాటితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే సామర్థ్యం ఆయనకుందని పార్టీ వర్గాలంటున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం రెట్టింపు అవడం ఖాయమన్నది నేతల ఆలోచన.

అయితే కాంగ్రెస్ సీనియర్ల ఆలోచన మాత్రం మరోలా కనిస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న డజను మందికి పైగా నాయకులు రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఒప్పకునేలా లేరు. ఆయన ఒక్కరే పాదయాత్ర చేస్తే పార్టీలో తమ పని ముగిసినట్లేనన్నది వారి భయం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా రేవంత్ రెడ్డికి గుర్తింపు వస్తుందన్న ఆందోళన వారికి ఉంది. అందుకే ఒకే పాదయాత్ర కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల నుంచి పలువురు నాయకులు విడివిడిగా నడిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను ముందుకు తీసుకువస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే కాకుండా ఆయనతో పాటు పలువురు సీనియర్లు కూడా పాదయాత్రలో ఉండేలా మరో ప్రతిపాదన తయారు చేస్తున్నారు. ప్రధానంగా భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తానూ పాదయాత్రకు రెఢీ అంటున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా మరో ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్ర అంశాన్ని ప్రస్తావించడం లేదు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అవకాశం ఉంటే తాను రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సై అంటున్నారు. ఆయన ఇప్పటికే పీపుల్స్ మార్చ్ పేరుతో తన నియోజకవర్గం మధిరలో పాదయాత్ర చేస్తున్నారు. వీరికి తోడు మరికొందరు నాయకులు కూడా యాత్రకు సై అంటున్నారు.

ఎవరు పాదయాత్ర చేయాలన్న దానిపైన తెలంగాణ కాంగ్రెస్ లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దీనిపైన అధిష్టానం కల్గజేసుకునే అవకాశముంది. పార్టీ హైకమాండ్ నిర్ణయం ఆధారంగా పాదయాత్ర ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి చేస్తారన్న దానిపైన స్పష్టత వస్తుంది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాకుండా ఇతర నాయకులెవ్వరు పాదయాత్ర చేసినా కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం ఉండే ఛాన్స్ కనిపించడం లేదు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn