మరో సారి రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనను గ్రుహా నిర్భంధంలో ఉంచడం ఈ వారంలో ఇది రెండో సారి. భూపాలపల్లి నియోజకవర్గం సాయంపల్లిలో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. తెల్లవారుజూమునే జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అయితే కొంత మంది పోలీసులు ఆయన నివాసంలోకి వెళ్లడంతో పీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాను. అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎలా వస్తారని రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. రైతులను పరామర్శించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందని రేవంత్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపైకి ఖాకీలను ఉసిగొల్పుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నులో వణుకుపుడుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు ప్రగతిభవన్, ఫాంహౌస్ లు బద్ధలైపోతాయని ఆయన హెచ్చరించారు. రైతులను పరామర్శించకుండా ఆపడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.