ఢిల్లీకి రేవంత్ రెడ్డి
1 min readహుజూరాబాద్ పైన కాంగ్రెస్ పోస్టుమార్టం నిర్వహిస్తోంది.అత్యంత ఘోరపరాజయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కేవలం మూడు వేల ఓట్లు రావడంపైన ఆగ్రహంగా ఉన్న హైకమాండ్ విచారణ నిర్వహిస్తోంది. హుజూరాబాద్ ఓటమిపైన ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ స్వయంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు పదమూడు మంది ముఖ్యనేతలను ఎఐసిసి పిలిచింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అభ్యర్థి వెంకట్ బల్మూర్ సమావేశానికి హాజరవుతున్నారు. వీరి నుంచి కెసి వేణుగోపాల్ విడివిడిగా వివరణ తీసుకునే అవకాశముంది. హుజూరాబాద్ ఫలితంపైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానానికి నివేదిక అందజేశారు. అంత తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయన్న దానిపైన ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇంఛార్జి పాడి కౌషిక్ రెడ్డి పార్టీని వదిలిపెట్టి వెళ్లడంతో పాటు ఈటెల రాజేందర్, కేసీఆర్ మధ్యనే ప్రధాన పోటీ అన్న వాతావరణం ఏర్పడిన తీరును ఆయన నివేదికలు పేర్కొన్నారు.
మరో వైపు ఇంకొందరు సీనియర్ నేతలు కూడా హుజూరాబాద్ పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కౌషిక్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని నాయకత్వం అస్సలు పట్టించుకోలేదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. స్థానిక నాయకత్వంతో మాట్లాడకపోవడం, అభ్యర్థిని చివరి నిమిషంలో ప్రకటించడంతోనే ఫలితంగా దారుణంగా వచ్చినట్లు వారు ఫిర్యాాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి టీం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల కోసం దామోదర రాజనర్సింహా ఆధ్వర్యంలో కమిటీ వేశామని, వాళ్ల సూచనల మేరకే నడుచుకున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. హుజూరాబాద్ ఫలితంతో కాంగ్రెస్ డీలా పడాల్సి అవసరం లేదన్నది రేవంత్ రెడ్డి అనుచరుల వాదన. గతంలో 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, అయినప్పటికి పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అధిష్టానానికి లేఖ రాశారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపైన కూడా సమీక్ష జరపాలని ఆయన కోరారు. హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ , జీహెచ్ ఎంసి ఎన్నికల ఫలితాలపైన విచారణ జరగాలని పొన్నం లేఖలో కోరారు.
మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఆధారంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి పలువురు సీనియర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి పనితీరు కారణంగానే ఇలాంటి ఫలితం వచ్చిందని వారు అధిష్టానం ముందు వాదించడానికి సిద్ధమౌతున్నారు. హుజూరాబాద్ పైన రేవంత్ రెడ్డి అలసత్వం కారణంగానే మూడు వేల ఓట్లు వచ్చాయని వారు అధిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లనున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఇచ్చే నివేదికను అధిష్టానం పరిగణనలోకి తీసుకోనున్నది.