హుజూరాబాద్ కు రేవంత్ రెడ్డి
1 min read
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనున్నది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల ముఖ్యనేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. అధికార టీఆర్ఎస్ తరుపున మంత్రి హరీష్ రావు తో పాటు పలువురు సీనియర్లు క్యాంపైయిన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో కోసం ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక బీజేపీ తరుపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఎంపి అర్వింద్ తో పాటు విజయశాంతి తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూర్ కోసం సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు విస్రుత్తంగా జనంలోకి వెళ్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హుజూరాబాద్ బరిలోకి దిగుతున్నారు. ఆయన రెండు రోజల పాటు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. ముఖ్యమైన పట్టణాల్లో ఆయన బహిరంగ సభలు ఉండనున్నాయి. ఈ నెల 23న సాయంత్రం వీణవంకలో రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తారు. రాత్రి జమ్మికుంటలో జరిగే రోడ్ షో, సభలో పాల్గొంటారు. 24న సాయంత్రం ఇల్లంతకుంటలో,రాత్రి కమలాపూర్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ ల్లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. రేవంత్ రెడ్డి రోడ్ షోలు, సభల విజయవంతం కోసం స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జి దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ కు మంచి ఊపు రావడం ఖాయమని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మరో వైపు ఇంటికో ఓటు వేయాలన్న నినాదంతో రేవంత్ రెడ్డి హుజూరాబాద్ లో ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవాలని ఆయన ఓటర్లను కోరనున్నారు.