పీసీసీ ఛీప్ మీరే.. జానారెడ్డికి ఫోన్.. కాని
Vsr ,Editor
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ అధ్యక్ష పదవి కోసం నేతలు సిగపట్లు పట్టుకున్నారు. నాకంటే నాకని కొట్టుకు చస్తున్నారు.ఒకరినొకరిని లాక్కోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఢిల్లీలో లాబీయింగ్ లు చేస్తు తమ అద్రుష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇంత జరుగుతుంటే ఓ సీనియర్ నేత మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. పీసీసీ ఛీప్ పదవి తీసుకోమని అధిష్టానం నుంచి ఫోన్ చేస్తే సింపుల్ గా నాకొద్దని చెప్పేశారు.ఈ వయసులో నాకోద్దు ఈ గొడవ అని పక్కకు తప్పుకున్నారు. ఆయనోవరో కారు పెద్దలు జానారెడ్డిగారు. అవును పీసీసీ ఛీప్ గా ఉండమని ఢిల్లీ నుంచి పనిగట్టుకొని ఫోన్ చేస్తే ఈ పెద్దాయన వదనేశారు. తాను అధ్యక్ష పదవి తీసుకోనని తెగేసి చెప్పారు. దీంతో ఇప్పుడు అధిష్టానం పెద్దలు నోరువెళ్లబెట్టాల్సి వచ్చింది. సీనియర్ నేత జానారెడ్డికి మూడు రోజుల క్రితం ఎఐసిసి కార్యదర్శి భక్తచరణ్ దాస్ స్వయంగా ఫోన్ చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిపైన తీవ్ర పోటీ నెలకొన్నందున మధ్యేమార్గంగా మీరు ఉండాలని ఆయన జానాను కోరారు. మీరు పీసీసీ ఛీప్ అయితే నాయకులంతా ఐక్యంగా ఉంటారని, అసమ్మతి సమస్య ఉండదని వివరించారు. పార్టీలో కూడా ఉత్సాహం వస్తుందని భక్తచరణ్ సూచించారు. అయితే జానారెడ్డి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష పదవి తీసుకోనని ఆయనకు స్పష్టం చేశారు. వయసురీత్యా తాను ఆ ఫోస్టుకు సరిపోనని, ఆ స్థాయిలో పనిచేయలేనని స్పష్టం చేశారు.
జానారెడ్డి నిర్ణయంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. రాజకీయాల్లో అంత హుందాగా ఉండటం అందరికి వల్ల కాదన్నది వారి అభిప్రాయం.పీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ లో కనీసం 25 మంది నాయకులు పోటీపడుతున్నారు. సీనియర్ నేతల నుంచి మొదటి సారి గెలిచిన వారి వరకు ఈ లిస్టులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జానారెడ్డి లాంటి నాయకుడు కీలక పదవిని తోసిపుచ్చడం విశేషం. మరోవైపు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కూడా పోటీకి ఆయన విముఖత చూపిస్తున్నారని సమాచారం. తన కుమారుడు రఘవీర్ రెడ్డిని బరిలోకి దింపడానికి ఆయన సిద్ధమౌతున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఒత్తిడి చేస్తే మాత్రం జానారెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి పీసీసీ ఛీప్ పదవి వద్దనడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన జానారెడ్డి మరో సారి తన ప్రత్యేకతను చూపించుకున్నారు.